- ఫ్యూచర్ ఎమ్మెల్యేగా పోటీకి అసక్తి చూపుతున్న నవతరం
- మాజీ సీఎం కేసిఆర్ ను కలిసిన మహిళా నేత
- బీఆర్ఎస్ టికెట్ పై కన్నేసిన చార్టెడ్ అకౌంటెంట్
నిజామాబాద్, బతుకమ్మ : ఆ నియోజకవర్గం గులాబీ పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయా.. కారు పార్టీ అధినేత అక్కడ ప్రధానంగా దృష్టి సారించారా..? ఆ నియోజకవర్గం బాధ్యతల కోసం కొత్త నేతలు ఆసక్తి చూపిస్తున్నారట. ఇటీవల ఎర్రవల్లి ఫాం హౌజ్ కు నియోజకవర్గానికి చెందిన జాతీయ పార్టీ మహిళా నేత ఒక్కరికి ఆహ్వానం అందడంతో కొత్త చర్చ జరుగుతుంది. అవకాశం ఇస్తే తాను బీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అంటున్నారట అప్ కమింగ్ లీడర్ ఒక్కరు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పొలిటికల్ గా వెరీ హాట్ గురు అంటారక్కడ. రాజకీయంగా విభిన్న తీర్పు ఇవ్వటంలో ఆ నియోజకవర్గానికి పెట్టింది పేరు. జిల్లా పాలిటిక్స్ కి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. అక్కడ ఫైర్ బ్రాండ్ లీడర్లకు కొదవ ఉండదు. ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. అతి తక్కువ కాలంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. అందుకే ఈ నియోజకవర్గ ప్రజల తీర్పు విభిన్నం అంటారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆదర్శ గ్రామాలకే కాదు.. ఓటర్ల చైతన్యానికి కూడా పెట్టింది పేరు.. జిల్లా రాజకీయ పరిస్థితుల మార్పునకు ఇక్కడి నుండే అడుగు పడుతుంది. అలాంటి ఆర్మూర్ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రం లో మార్పు రానుందనే ప్రచారం జరుగుతుంది. ఉన్నట్లుండి అన్ని ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గం పై ఫోకస్ పెంచటమే ఇందుకు ఉదాహరణ. మరో వైపు ఇక్కడ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు కొత్త నేతలు కూడా రెడీ అవుతుండగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి మరికొందరు సమాయాత్తమౌతున్నారు.
ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఆసక్తి చూపుతున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన స్పీడు పెంచుతున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పేరుగాంచిన చార్టెడ్ అకౌంటెంట్ బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఈరవత్రి రాజశేఖర్. ఈయన సామాజిక సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. ఆయన తండ్రి ఈరవత్రి రాందాస్ పేరుతో ట్రస్టు ఏర్పాటు చేసి నియోజకవర్గంలో విస్తృత సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నందిపేట్ మండలంలోని గోదావరి ముంపు గ్రామం కుస్తా పూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ ఆర్మూర్ లో స్థిర పడ్డారు. చాటెడ్ అకౌంటెంట్ గా మంచి పేరుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఎలాగైనా ఆర్మూర్ నుండి పోటీచేయాలన్న సంకల్పంలో ఉన్నారట. ఆర్మూర్ లో ఇప్పటికే నయా లీడర్ కోసం గులాబీ బాస్ అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఆర్మూర్ నియోజకవర్గంలో బిసీ ఓటర్లు బలంగా ఉన్నారు.ఆర్మూర్ అంటే కేసీఆర్ కు సెంటిమెంట్. 2014 అసెంబ్లీ ఎన్నికల మొదలు ఇక్కడి నుంచే ఫస్ట్ టికెట్ ప్రకటన చేస్తారు. పదేళ్లుగా ఆర్మూర్ లో కారు పార్టీ బలంగా ఉండేది. ప్రస్తుతం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పుంజుకోవాలనే ఉద్దేశంలో గులాబీ బాస్ ఉన్నారట. ఆర్మూర్ నియోజకవర్గంలో ధీటైన నాయకుడికోసం చూస్తున్న కారు పార్టీకి రాజశేఖర్ వెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేసీఆర్ మనుషులు రాజశేఖర్ తో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఇక్కడ బీసీ నేత కోసం చూస్తున్నాయి పార్టీలు. బలమైన సామాజిక వర్గం బీసీ కావటంతో రాజశేఖర్ పై గులాబీ పార్టీ గురిపెట్టినట్లు సమాచారం. మరోవైపు రాజశేఖర్ కూడా బిఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీజేపీ బడా నేతలు కూడా రాజశేఖర్ కు టచ్ లోఉన్నారని తమ పార్టీ అంటే తమ పార్టీలోకి రావాలన్న ఆహ్వానాలు కూడా అందుతున్నట్టు సమాచారం. మరోవైపు రాజశేఖర్ కు ఏ పార్టీ అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా.. పొలిటికల్ ఎంట్రీ మాత్రం పక్కా అంటున్నారాయన. ఇప్పుడు ఆర్మూర్ పొలిటికల్ సర్కిల్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
జాతీయ పార్టీలో ఉన్న మహిళా నేత కుడా అసెంబ్లీలో పోటీ చేసేందుకు అసక్తి చూపుతున్నారని ఆర్మూర్ నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ను ఆశించి జాతీయ పార్టీలో చెరిన ఆమెకు అవకాశం దక్కలేదు. దానితో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆ మహిళా నేతకు మాజీ సీయం కేసిఆర్ నుంచి ఆహ్వానం అందడం బిఆర్ఎస్ లో కొత్త చర్చకు దారి తీసింది. ఆర్మూర్ నియోజకవర్గంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోవడం, మాజీ ఎమ్మెల్యేపై వివాదాలు చుట్టు ముసురుతుండటంతో కేసీఆర్ ప్రత్యామ్నాయ నాయకత్వంకు అసక్తి చూపుతున్నట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో తనతో పనిచేసిన దివంగత నేత మాజీ అధ్యక్షులు, కూతురు గత నెలలో మాజీ సీయం కేసీఆర్ ను ఫాంహౌజ్ లో కలవడం ఆర్మూర్ రాజకీయ ముఖ చిత్రంలో మార్పులపై జోరుగా చర్చ జరగుతుంది. జిహెచ్ ఎంసీ పరిధిలో కార్పోరేటర్ గా పనిచేసి, తండ్రి రాజకీయ వారసురాలిగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు అట. ఏకంగా బీఆర్ఎస్ అధినేత స్వయంగా మహిళా నేతను పార్టీలోకి ఆహ్వానించడంతో భవిష్యత్తు లో పోటీకి అవకాశం ఇస్తారా అనే చర్చ కుడా పార్టీలో జరుగుతుంది.
