ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌లో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980-82 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు తమ పాఠశాల పట్ల మమకారం చాటుతూ ప్రస్తుత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు. విద్యార్థుల అక్కరను గుర్తించి, విద్య ప్రోత్సాహక కార్యక్రమంగా వారికి నిత్యజీవితానికి ఉపయోగపడే సహాయం అందించారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు గుండ్ల మహాలక్ష్మి (బైపీసీ) 915 మార్కులతో ఫస్ట్ ర్యాంక్, పవార్ నందిని (సీఈసీ) 842 మార్కులతో సెకండ్ ర్యాంక్ సాధించగా, ఇద్దరికి రూ.10,000/- నగదు బహుమతి, కంప్రిహెటివ్ బుక్స్ అందజేసినట్లు తెలిపారు. అదే విధంగా, పవార్ నందిని గతంలో జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ లో 10 వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.25,000/- నగదు బహుమతిని మా తరపున అందిస్తాం. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకెళ్లాలి, అని సూచించారు. విద్యార్థుల మానసిక వికాసం కోసం కళాశాలలో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ స్టేజి ఏర్పాటు చేసి, అందులో నిపుణుడిని నియమించనున్నట్లు కూడా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇంటెలిజెన్స్ ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి. కసి, పట్టుదల ఉంటే సాధ్యం కానిది లేదు. నేను ఇంటర్ చదివే సమయంలోనే ఎస్ఐ కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. అదే దిశగా కృషి చేసి ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా ఉన్నాను, అని వివరించారు. తాజాగా కళాశాలలో చేరిన అధ్యాపకురాలు ఎంతో ప్రతిభావంతురాలని చెప్పి, ఆమెను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యతో జీవితంలో ఎదగాలని, సమాజానికి మేలు చేయాలని అభిలషించారు. అందుకోసం విద్యార్థులు తమ ఆదాయంలో కనీసం 5 శాతం సమాజ సేవకే కేటాయించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గతాన్ని నెమరు వేసుకుంటూ, తాము చదువుకున్న కళాశాలకు ఏదైనా విధంగా సహాయం చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అంతకుముందు ప్రభుత్వ అధికారులుగా ఉన్న పూర్వ విద్యార్థులు వెంకటేశ్వర్ రావు (మున్సిపల్ కమిషనర్), సంజీవ్ రావు తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో శ్రమ, నిరంతర కృషి, మరియు సుదీర్ఘ లక్ష్య దృష్టి అవసరమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రిన్సిపాల్, విశాల, అధ్యాపకులు డా. రామచందర్ రావు, నునుగొండ ఆంజనేయులు, నునుగొండ మూర్తి ప్రస్తుత అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
187
