పిట్లం, బతుకమ్మ : అత్తను అల్లుడు హతమార్చిన ఘటన పిట్లం మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నలక్ష్మీ మధ్యాహ్న భోజన కార్మికురాలిగా స్థానిక పాఠశాలలో పనిచేస్తుంది. తన కుమార్తెకు అదే గ్రామానికి చెందిన బాగరాజుతో కొంతకాలం క్రితం వివాహం చేసింది. ఇటీవల పంట సాగును అల్లుడు బాగరాజు చూస్తున్నాడు.

అయితే పంట డబ్బుల విషయంలో గురువారం ఉదయం గొడవ జరిగింది. స్థానికులు ఇద్దరి మధ్య సయోధ్యతో సద్దుమణిగించారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండివార్చి వస్తున్న జిన్న లక్ష్మిని బాగరాజు దారికాచి పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చాడు. బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, రూరల్ సీఐ రాజేష్, పిట్లం ఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

