బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీ, బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా జూన్ నెల ఆఖరి వరకు లబ్ధిదారులకు అందేలా చూడాలని పనులు నెమ్మదిగా ఉన్న చోట లబ్ధిదారులతో సంప్రదించి సమస్యలు ఉంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కారించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తూ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రతి దశలో బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి అయిన లబ్ధిదారులచే వెంటనే గృహప్రవేశం చేయించాలని తెలిపారు.ఏదైనా సమస్యలచే ఇళ్లు మంజూరు అయి ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే లబ్ధిదారులచే సంప్రదింపులు జరిపి త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డివో రవీందర్ రెడ్డి, బాన్సువాడ పట్టణ, బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

