27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

దొంగనోట్ల జోరు

Must read

📰 Generate e-Paper Clip

. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పట్టుబడిన ముఠాలు

. గాంధారి, బిచ్కుందలో నకిలీ నోట్లు ప్రత్యక్షం

. చలామణి చేస్తున్న వారు సరే.. ముద్రిస్తున్న వారు ఎవరు..?

. మూలలను పసిగట్టలేకపోతున్న ఖాకీలు

నిజామాబాద్, బతుకమ్మ:  ఏ మాత్రం కష్టపకుండా డబ్బులు సంపాదించాలన్న దురాశతో దొంగ నోట్ల దందాను ఎంచుకుంటున్నవారు ఈ మధ్య కాలంలో పోలీసులకు ఎక్కవ సంఖ్యలో చిక్కుతున్నారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్న వారు దొంగ నోట్ల దందాను ఎంచుకుంటున్నారు. ఇటీవల కాలంలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో దొంగనోట్లు చలామణి చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్టు చేసి పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నకిలీ కరెన్సీ ముద్రించి చలామణి చేస్తున్న ఎనిమిది మందిని శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. నకిలీ కరెన్సీ ముద్రణకు ఉపయోగించే పేపర్ తోపాటు రూ.38.84 లక్షల నగదు, రూ.21 లక్షల విలువైన నకిలీ నోట్లతోపాటు కారు, తొమ్మిది సెల్ ఫోన్ లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఒకటికి నాలుగు రెట్లు

లక్ష రూపాయల అసలు కరెన్సీకి నాలుగు రెట్లు విలువైన నకిలీ నోట్లను అందిస్తామని వరంగల్ కు చెందిన ముఠా ఆకర్షిస్తూ దందా చేసిందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.  ప్రధాన నిందితుడైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మణికళ కృష్ణ (57) త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో, నకిలీ కరెన్సీని చలామణి చేయాలని ప్రణాళిక రూపొందించాడన్నారు. ఇందుకోసం హన్మకొండకు చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్‌తో జతకట్టాడని తెలిపారు. నకిలీ కరెన్సీ చలామణి చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారని ఇందులో భాగంగా హన్మకొండలో తనకు నకిలీ కరెన్సీ అప్పగించాలని శ్రీనివాస్ కోరగా, కృష్ణ అంగీకరించాడన్నారు. ఒప్పందం ప్రకారం, కృష్ణ మరో నలుగురితో కలిసి శుక్రవారం రాత్రి వరంగల్ అవుటర్ రింగ్ రోడ్డులోని పెగడపల్లి క్రాస్‌రోడ్‌కు కారులో రాగా, శ్రీనివాస్, మరో ఇద్దరు నిందితులు అప్పటికే అక్కడ ఉన్నార్నారు. నోట్ల మార్పిడీ జరుగుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ బృందం వారిని పట్టుకుందని సీపీ తెలిపారు. ప్రధాన నిందితుడైన కృష్ణపై గతంలో సత్తుపల్లి, వీఎం బంజారా, లక్ష్మీదేవి పేట పోలీస్ స్టేషన్ లలో రూ.500 నకిలీ నోట్లను ముద్రించి, తన స్నేహితులతో కలిసి చలామణి చేసినందుకు కేసులు నమోదయ్యాయి. నకిలీ నోట్లు వరంగల్ కే పరిమితం కాలేదు. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు, అటు నల్లగొండ నుంచి మహబూబ్ నగర్ వరకు దందా జోరుగాసాగుతోంది. ఇటీవల దేవుడి ఆలయ హుండీలోనూ నకిలీ కరెన్సీ బయటపడింది.

హైదరాబాద్ నుంచి బాన్సువాడకు..

కామారెడ్డి జిల్లా బిచ్కుందలోని ఓ వ్యాపారి దొంగనోట్లు చలామణి చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో అతడిపై పోలీసులు అతడిపై నిఘా సారించారు. సదరు వ్యక్తి ఎవరెవరిని కలుస్తున్నాడు? దొంగనోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడనే వివరాలు సేకరించారు. పక్కా సమాచారం అందిన తర్వాత గుట్టురట్టు చేశారు. సదరు వ్యాపారి హైదరాబాద్‌ నుంచి బాన్సువాడకు, అక్కడి నుంచి బిచ్కుందకు నకిలీ కరెన్సీ తీసుకొస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గాంధారి మండలం చద్మల్ లో నిర్వహించిన మహాలక్ష్మమ్మ పండుగ సందర్భంగా కాయితీ లంబాడాలకు ఇచ్చిన రుణాల డబ్బుల్లో నకిలీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ కేసులో ఏడుగురి పోలీసులు అరెస్టు చేసి రూ.న10లక్షల వరకు నకిలీ కరెన్సీని సీజ్ చేశారు.

 ఓ వైపు పట్టుబడుతున్నా.. మరోవైపు ఆగని దందా

నకిలీ నోట్లు ఓ వైపు పట్టుబడుతూనే ఉన్నా మరో వైపు దందా ఆగడం లేదు. దీంతో నకిలీ నోట్ల మూలాలపై పోలీసులు ఫోకస్ పెట్టడం లేదనే వ్యక్తమవుతున్నాయి. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నవారిని అరెస్టు చేస్తున్నా అవి ఎక్కడ తయారవుతున్నానేది తేల్చడం లేదనే విమర్శలున్నాయి.

రవి ఎవరు..?

వరంగల్‌లో పట్టుబడిన ముఠా వెనుక మరో వ్యక్తి ఉన్నాడనే ప్రచారం జరుగుతోంది. అతడే నకిలీ నోట్లను ముద్రించి కృష్ణ వంటి వారికి సరఫరా చేస్తున్నాడని తెలుస్తోంది. పోలీసుల విచారణలో ముఠా సభ్యులు రవి అనే పేరును పోలీసులకు చెప్పారని తెలిసింది. కానీ.. ఆ రవి ఎవరనేది ఎవరికీ తెలియదు. అతడి దగ్గరే నోట్లను ముద్రించే మిషన్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. చలామణి చేస్తున్న వారినే కాకుండా.. మూమాలపై దెబ్బకొడితే.. నకిలీ కరెన్సీ దందా ఆగే అవకాశం ఉంది.

More articles

Latest article