. తహతహలాడుతున్న తహసీల్దార్లు
. వీ ఆర్ ఏలను పట్టించుకునే వారు లేరు..
. సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేస్తామంటున్న వీఆర్ ఏలు
. మంత్రి పొంగులేటితో నేడు భేటీ కానున్న యూనియన్ ల నాయకులు
నిజామాబాద్, బతుకమ్మ: ఎన్నికలకు ముందు వేరే జిల్లాలకు బదిలీ అయిన తహసీల్దార్లు సొంత గూటికి చేరుకునేందుకు తహతహలాడుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు జిల్లా నుంచి బదిలీపై వెళ్లినవారు కొందరైతే, పార్లమెంటు పరిధిలో పని చేస్తున్న వారిని సైతం స్థానికం పేరుతో మరికొందరిని ఇతర జిల్లాలకు పంపించారు. సొంత జిల్లాను వీడెందుకు ఇష్టం లేకున్నా అప్పటి పరిస్థితుల కారణంగా వెళ్లిన వారు ఎప్పుడెప్పుడు సొంత జిల్లాకు చేరుకుంటామా అని ఎదురు చూస్తున్నారు. దీనికోసం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి పలుమార్లు యూనియన్ తరఫున విన్నవించారు. వారి ప్రయత్నాలు చివరికి ఫలించాయి. శనివారం(ఈ రోజు) మధ్యాహ్నం రెవెన్యూ పరిధిలోని పలు సంఘాల నాయకులతో సమావేశమయ్యేందుకు మంత్రి సమయం ఇచ్చారు.
సొంత గూటికి వచ్చేందుకు
జిల్లా నుంచి చాలామంది తహసీల్దార్లు జోన్ – 2 పరిధిలోని నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ జిల్లాలకు వెళ్లగా, మరికొందరు మల్టీ జోన్ లోకి బదిలీ అయ్యారు. వీరందరినీ జిల్లాలో సర్దుబాటు చేసే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు తమకు నచ్చిన చోట పోస్టింగ్ తీసుకున్న తర్వాత తమ అనుయాయులకు, మిగిలిన వారికి పోస్టింగ్ లు ఇప్పించుకునే అవకాశాలున్నాయి. మిగతా వారికి జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంటుంది.
వీఆర్ఏల పరిస్థితి ఏమిటి?
రెవెన్యూ విభాగం లోని వీఆర్వో, వీఆర్ఏలను అప్పటి ప్రభుత్వం ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రామ సేవకులుగా సేవలందించిన వీఆర్ఏలను వారి విద్యార్హతలను ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే చాలీచాలని వేతనాలు తీసుకునే వీఆర్ఏలను జోన్లు దాటించారు. నిజామాబాద్ జిల్లా వారికి నల్గొండ, మహబూబ్ నగర్ వంటి దూర ప్రాంతాల్లోని జిల్లాల్లో పోస్టింగ్ ఇచ్చారు. వీరిని జిల్లాకు రప్పించాలనే ఆలోచన ఏ యూనియన్ కూ లేదనేది బహిరంగ రహస్యమే. దీంతో విసిగెత్తిన వీఆర్ఏలు సెక్రటేరియట్ ముందు ధర్నా నిర్వహించాలనే ఆలోచనలకు వచ్చినట్లు తెలిసింది. గెజిటెడ్ హోదాలో ఉన్న తహసీల్దార్లు మాత్రం సొంత జిల్లాకు వచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం.
