. . . దేగాం గ్రామంలో ఇటుక బట్టీలలో కూలీల కన్నీటి గాధలు
. . . చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్న బక్క పలచని ప్రాణాలు, గర్భిణీలు
. . . ఇటుక బట్టీల కూలీలు పునరావాస కేంద్రానికి తరలింపు
. . . కూలీల భద్రతకు భరోసా కల్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ
నిజామాబాద్, బతుకమ్మ :
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు చెందిన వందలాది మంది కూలీలు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం గ్రామ శివారులో ఇటుక బట్టీలలో కూలీలుగా పని చేస్తూ కనీస వసతులు లేక వెట్టిచాకీరి బతుకులు బతుకుతున్నారని తెలుసుకున్న జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవిఎన్ భారత లక్ష్మీ, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ, ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటేశ్వర్ రెడ్డి లను వెంటబెట్టుకు వెల్లి మంగళవారం ఆకస్మికంగా ఇటుక బట్టీల ప్రాంతాన్ని పరిశీలించారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేరుకున్న ఆమె కూలీలు నివసిస్తున్న స్థలాలకు వెల్లి వారిని పలకరిస్తు ఇటుకలు తయారు చేస్తున్న స్థలం, ఇటుక బట్టీలను సందర్శిస్తూ కదిలారు. ఎక్కడ నుండి వచ్చారు ఎవరు మిమ్మల్ని ఇక్కడికి కూలీలుగా తీసుకువచ్చారు అంటు తెలుసుకున్నారు. కూలీలుగా పని చేస్తున్న వారితో అక్కడి పని పరిస్థితులు రోజువారిగా ఎంత కూలీ చెల్లిస్తున్నారనే విషయాలు, ఆరోగ్యాల గూర్చి వాకబు చేశారు. గర్భవతులుగా ఉన్న మహిళలు మండుటెండలో పని చేస్తున్న విధానాన్ని పసి గట్టారు. కూలీల పిల్లలను గదులలో బందిస్తున్న తీరును తెలుసుకుని ఆవేదన చెందిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. అడుగడుగున చట్టాల ఉల్లంఘన ఉండటాన్ని గమనించారు. కూలీలతో మాట్లాడుతున్న సందర్బంలో వారి మాటలను బట్టి వారిపై హింస జరుగుతున్నట్లు ఎరుక జేసుకున్నారు. కూలీలు నివసిస్తున్న నివాసాలను చూసి ఇళ్ళా పిచ్చుక గూళ్ల అంటు ఆశ్చర్యం చెందారు. ఐదు, ఏడు అడుగుల స్థలంలో ఇటుకలు, కట్టెలు కట్టి గోడలుగా జేసీ పైన రేకులు, ప్లాస్టిక్ కవర్లు కప్పి చిన్నసైజు ఇల్లుగ్గా మార్చడమేనా..! ఇందులోనే మీరంతా నివసిస్తున్నది అనుకుంటు నిట్టూర్పు విడిచారు. ఇక్కడేనా అంటు కూలీల ముఖాల్లో నెత్తురు చుక్క కనబడకపోవడంతో కలత చెందారు.

. . . జిల్లా జడ్జి కి కనిపించిన ఎస్ఆర్ఎస్ పి నుంచి సేకరించిన నల్లమట్టి
శ్రీరామ్ సాగర్ నీటి ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి ట్రాక్టర్లలో మట్టి సేకరించి ఇటుక బట్టీలకు తరలిస్తున్నది అధికారికమా.. అనాధికారమా అంటు.. తెలుసుకోవాలన్నారు. కూలీలందరిని బస్సులలో ఆర్మూర్ లోని పునరావాస కేంద్రానికి తరలింప జేశారు. చట్టాల ఉల్లంఘనలపై చట్టపరమనైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించాలని ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవికి సూచించారు. కూలీలను స్వంత ఊర్ల కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
. . . కేజిఎఫ్ సినిమాలో మాదిరిగా కూలీల బతుకులు
కేజీఎఫ్ సినిమాలో లాగా కూలీల బతుకులు ఉన్నాయంటు బంధించి బంధీఖానాలో ఉంచుతున్నారని సంబంధిత ఇటుక యాజమాన్యంపై జిల్లా జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెట్టిచాకిరి చేస్తూ బానిసలుగా బతుకులీడిస్తున్న బడుగు జీవులకు జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నాల్సా న్యాయ సహాయం అందిస్తుందని బతుకుపై బెంగ వద్దు అంటు కూలీల బుజం తట్టారు. ఎంత మంది కూలీలు ఉన్నారు. రిజిస్ట్రార్ ఏమైనా ఉన్నదా..రోజు కూలీ ఎంత అనే వివరాలు నమోదు చేస్తున్నారా అనే వివరాలు తెలుసున్నారు. కిరణ్ రెడ్డి, తిరుపతి రెడ్డి అనే ఇటుక తయారు చేయించే కాంటాక్టర్లు తమను ఇక్కడికి తీసుకుని వచ్చారని ఇటుక కార్మికులు జిల్లాజడ్జికి విన్నవించారు. ఇటుక బట్టీల ప్రాంతమంత కలియ తిరిగిన జిల్లా జడ్జి భారత లక్ష్మీ అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా న్యాయసేవ అధికార సంస్థకు అందిన సమాచారం మేరకు దేగాం గ్రామ శివారులోని ఇటుక బట్టీలలో పని చేస్తున్న కూలీల విషయమై వివరాలు సేకరించుకోవడానికి కూలీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి చట్ట ఉల్లంఘనలు తెలుసుకోవడానికి వచ్చామని అన్నారు. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన స్పష్టంగా కనడుతున్నదని తెలిపారు. నెల్లూరు జిల్లా నుండి కూలీలను రోజువారి కూలీ కింద తీసుకువచ్చిన విషయం పసిగట్టామని సంబంధిత కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. కార్మికుల కష్టాల కడగండ్లు దీనస్థితి కండ్లారా చూశామని మనసు కలచి వేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, పురుషులు ఎవరి ముఖాల్లో కష్టం చేస్తున్నామన్న ఛాయాలే లేవని బంధించి బలవంతంగా పని చేయిస్తున్నారన్న భావమే కనపడిందని ఆమె పేర్కొన్నారు. చట్టం ఒక బలమైన ఆయుధమని చట్ట ప్రకారమే తగిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. గర్భిణీతో ఉన్న మహిళలు కూడా మండుటెండలో పని చేస్తుడటం భాధకరమేనని అన్నారు.
