- పాటించని క్రమ సంఖ్య
- దాచిన ఖాళీలు
- మేకలు ఇచ్చిన లైన్మెన్ కు
- తప్పిదాలతో అన్యాయం
- అందుకేనా డీఈ బదిలీ
నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల జరిగిన బదిలీలలో యూనియన్ నాయకులు అధికారితో కలిసి అనుకున్న వాళ్లకు పోస్టింగ్ ఇప్పించుకున్నారనే ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఆర్మూర్ డివిజన్ పరిధిలో 74 మంది లైన్మెన్ లకు బదిలీ జరిగింది. అర్హులైన వారి జాబితాను ముందుగా వెలువరించారు. దీని ప్రకారమే సంస్థలో బదిలీ ప్రక్రియ కొనసాగాలనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం క్రమ సంఖ్యను తప్పించి తమ అనుకున్న వాళ్లకు, ముడుపులు ఇచ్చిన వాళ్లకు కోరుకున్నచోట పోస్టింగులు వచ్చేలా చేసుకున్నారని ఉద్యోగులు వాపోయారు. ఈ దుమారమంతా కంపెనీ సీఎండి వరకు వెళ్లడంతో, దీనికి సంబంధించిన అధికారిపై బదిలీ వేటుపడిందనే ప్రచారం జరుగుతోంది.
పాటించని క్రమ సంఖ్య : సంస్థ నిబంధనల ప్రకారం బదిలీకి అర్హులైన వారి జాబితాను ప్రకటించిన పిదప దీని ప్రకారమే పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓ అండ్ ఏం (ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్) సిబ్బందికి వెబ్ ఆప్షన్ కలిపించలేదు. ప్రస్తుతం వారు చేస్తున్న సెక్షన్ కాకుండా మరో సెక్షన్ లో ఉన్న ఖాళీలలో చేరేందుకు కనీసం ఐదు ఆప్షన్లను ఇవ్వాలి. వీటిని పరిశీలించిన అనంతరం క్రమ సంఖ్య ఆధారంగా లైన్మెన్లు ఎంచుకున్న ఆప్షన్ ప్రకారం పోస్టింగ్ ఖరారు చేయాల్సి ఉంటుంది. ముందుగా ఎంచుకున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. డివిజన్లో మాత్రం 74 మందిలో (6, 19, 25, 27, 31, 36, 37, 43, 45, 46, 47, 48, 49, 51, 53, 55, 56, 57, 59, 62, 71, 72, 73, 74 ) 24 మందిని పక్కకు పెట్టేశారు. వీరికి ఫోన్లు చేసి వెంటనే కార్యాలయానికి కౌన్సిలింగ్ కోసం రావాలని ఆదేశించారు.
ఖాళీలు దాపరికం : బదిలీకి అర్హులైన 74 మందికి 74 ఖాళీలను ముందుగా చూపించారు. ముందుగా 50 మందికి కౌన్సిలింగ్ లేకుండా పోస్టింగ్ ఇచ్చారు. మిగిలిన 24 లో 8 ఖాళీలను చూపించకుండా దాచి పెట్టారు. ఆప్షన్ల ప్రకారం క్రమ సంఖ్య అనుకూలంగా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉండగా మిగతా 24 మందిని కౌన్సిలింగ్ కోసం డివిజన్ కార్యాలయానికి పిలవడంతో తమకు అన్యాయం జరిగినట్లేనని లైన్మెన్లు ముందుగానే భావించుకున్నారు.
ఫిర్యాదులు వెళ్ళినా : ఒక గ్రామంలో లైన్మెన్ తప్పిదాల వల్ల ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు గాయాలపాలయ్యారు. లైన్మెన్ ఆగడాలను, ప్రమాదాల బారిన పడిన వారిని చూసిన గ్రామస్తులు పై అధికారులకు ఫిర్యాదు చేయగా దీనిపై విచారణ జరిపించారు. ఇతనికి గుండెల్లో స్టంట్ లు వేశారని చూపుతూ రక్షణ కోసం సబ్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఇంకొకరికి ఇలాగే స్టంట్లు రెండు వేసారు. ఇతనికి ఆపరేటర్ గా ఇవ్వాలని బతిమిలాడినా కనికరించకుండా ఫీల్డ్ ఇచ్చారు.
ఆరోగ్యంగా ఉన్నా : శారీరక ఇబ్బందులు ఉన్నవారికి ఇవ్వాల్సిన పోస్టును ఆరోగ్యంగా బాగుండీ సబ్ స్టేషన్ చేస్తున్న లైన్మెన్ కు వేరే గ్రామంలో ఆపరేటర్ గా పోస్టింగ్ ఇచ్చారు.
మద్యం సేవిస్తున్న : అతిగా మద్యం సేవించి సబ్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఒకరికి సబ్ స్టేషన్ విధులు కేటాయించారు.
దృష్టి లోపం : వేర్ డివిజన్ నుంచి ఆర్మూర్ డివిజన్ కు రాకపోకలు సాగిస్తున్న లైన్మెన్ కు దృష్టిలోపం ఉందని సబ్ స్టేషన్ ఆపరేటర్ గా ఇచ్చారు కనీసం 60 శాతం పైన లోపం ఉన్న అతను సబ్ స్టేషన్ లో విధులు నిర్వహించడం ప్రమాద భరితంగా భావిస్తున్నారు.
కడుపులో ఆపరేషన్ : సంస్థ విధించిన ఆరోగ్య నిబంధనలో వ్యాధి లేకపోయినా ఆపరేషన్ జరిగిందని సబ్ స్టేషన్ నుంచి సబ్ స్టేషన్ ఇచ్చారు.
మేకలు ఇచ్చిన లైన్మెన్ కు : డివిజన్ లోని అధికారి వేరే డివిజన్ లో పండుగ చేశారు. క్షేత్రస్థాయిలో ఎంత తిన్న తనవైపు చూడకుండా ఉండేందుకని ఒక లైన్మెన్ పండుగ చేసిన అధికారికి మేకలను పంపిన విషయం డివిజన్లో ప్రచారం జరుగుతోంది. సంబరపడిన ఆ అధికారి బహుమానంగా ఆప్షన్లో ముందుగా రాయలేని గ్రామాన్ని రాత్రి సమయంలో లైన్మెన్ చేత రాయించి పోస్టింగ్ ఇచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
పోల్ పైన పడడంతో : విధులలో భాగంగా విద్యుత్ స్తంభం పైకి లేపేటప్పుడు జారీ లైన్ మెన్ పై పడింది. ఆపరేషన్ చేస్తే ఒక పక్క భాగం పని చేయదని వైద్యులు చెప్పడంతో దానిని విరమించుకున్నాడు. ఆరోగ్య దృష్ట్యా ఫీల్డ్ నుంచి సబ్ స్టేషన్ కు ఆపరేటర్ గా వేయాలని కోరగా యూనియన్ల మధ్య రాద్ధాంతం జరిగినట్లు తెలిసింది. బదిలీలలో ఇన్ని తప్పిదాలు జరిగిన దృష్ట్యా డివిజన్ లో జాబితాలో ఉన్నవారికి క్రమ సంఖ్య ఆధారంగా పోస్టింగ్ లు ఇవ్వాలనే అభిప్రాయాలు వక్తమవుతున్నాయి.
