మోర్తాడ్, బతుకమ్మ: ముగ్గురు విద్యార్థులు ఉన్న పాఠశాల మూతపడుతుంది అనుకున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చి ముగ్గురిని ఉన్న విద్యార్థుల సంఖ్యను 17 మంది విద్యార్థులకు పెంచి ప్రభుత్వ బడిని బతికించాడని మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. గత సంవత్సరం ఉపాధ్యాయుల బదిలీ విషయములో మోర్తాడ్ మండలంలోని శెట్పల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో విద్య బోధించడానికి వచ్చారు. కేవలం ముగ్గురు విద్యార్థులే ఉండడంతో కొంత ఇబ్బందికి గురైనప్పటికీ ముగ్గురు విద్యార్థులను అన్ని విషయాలలో అన్ని సబ్జెక్టులలో నిష్ణార్థులుగా చేసి తరిఫీదు ఇవ్వడంతో వాళ్ల ప్రతిభను చూసిన మిగిలిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తామని ఆసక్తితో ఈ విద్యా సంవత్సరం 14 మందిని పిల్లల్ని చేర్పించారు. దీంతో పాఠశాలలో 17 మంది విద్యార్థులతో పాఠశాల నూతన అందాలను సంతరించుకుంది. దాతల సహకారంతో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, బూట్లు, టై, బెల్ట్ లు అందజేసి ప్రైవేట్ కు దీటుగా విద్యాబోధన చేస్తున్నారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ చదివించడం రాయించడం ఆటల్లోనూ చదువులోనూ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో సాధ్యమైందని పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ అన్నారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మండల విద్యాధికారి స్పందించి మరో ఉపాధ్యాయుని పాఠశాలకు పంపించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత ప్రమాణాలతో విద్య బోధించి విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఇంకా కృషి చేస్తామని పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ తెలియజేశారు.

