బతుకమ్మ : నాగిరెడ్డిపేట: జాతీయ రహదారి విస్తరణ పనుల కేపిసి సంస్థ గుత్తేదారు నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోకి వర్షపు నీరు చేరి చెరువుల మారిందని, కె పి సి సంస్థ కాంట్రాక్టర్ పై ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ పోచారం గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మండలంలోని పోచారం గ్రామంలో గల ఎన్ హెచ్ 765 D రోడ్డు విస్తరణ నిర్మాణ పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం పనులు గత కొద్ది కాలంగా చేపడుతున్నారు. డ్రైనేజీ పనులను పాఠశాల వరకు అసంపూర్తిగా చేపట్టడంతో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన రహదారి పై నుండి డ్రైనేజీ ద్వారా వచ్చిన వర్షపు వరదతో పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో వర్షపు వరద నీరంతా పాఠశాల ఆవరణంలో చేరి పాఠశాల చెరువులా మారిందని, పాఠశాల ఆవరణలో చేరిన నీటిలో స్నానాలు చేస్తూ ఈతలు కొట్టారన్నారు. పాఠశాల ఆవరణలో చేరిన నీటితో పాఠశాల కూలిపోయే ప్రమాదం ఉందని, రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న కంపెనీ (కెపిసి) యజమాన్యానికి తెలియజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు ఆరోపించారు. కెపిసి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో విసుగు చెందిన గ్రామస్తులు కెపిసి కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో ఎక్కడికి అక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ మల్లారెడ్డి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పి సంబంధిత కాంట్రాక్టర్ ను రప్పించారు. గ్రామస్తులతోపాటు ఎస్సై, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామానికి చెందిన నాయకులు కాంట్రాక్టర్ తో మాట్లాడి పాఠశాల ప్రాంగణంలో గల నీరును తొలగించాలని అలాగే డ్రైనేజీనే పూర్తిగా ప్రాజెక్టు కాలువలోకి వెళ్లేలా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్, ఎస్సై మల్లారెడ్డి, స్థానిక నాయకులు కలిసి పాఠశాలలో నిలిచి ఉన్న నీరును తొలగించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి తాత్కాలిక మరమ్మతులు చేపడితే ఊరుకునేది లేదని, శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. అనంతరం పోచారం ప్రాథమికోన్నత పాఠశాలలో చేరిన వర్షపు వరద నీటితో కూలిన ప్రహరీ గోడను తిరిగి నిర్మించేలా, వర్షపు నీటిని తొలగించేలా కెపిసి కాంట్రాక్టర్ తో మాట్లాడి చర్యలు చేపట్టాలని కోరుతూ తహాశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణిలో తహశీల్దార్ శ్రీనివాసరావు కువినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పోచారం గ్రామస్తులు ఉన్నారు.

