30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

తాగునీటి సమస్యపై ఖండ్‌గాం గ్రామస్తుల ఆందోళన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: బోధన్ మండలంలోని ఖండ్‌గాం గ్రామ ప్రజలు త్రాగునీటి సమస్యపై రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఫిల్టర్ వాటర్ బాటిల్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గ్రామ యువకుడు మిసాలే నాగేష్ మాట్లాడుతూ బోధన్ మండలంలోని ఖండ్‌గాం, భిక్నెల్లి, సిద్దాపూర్ గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. గ్రామానికి పక్కనే మంజీరా నది ఉన్నప్పటికీ త్రాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖండ్‌గాం నుంచి కల్దుర్కి వెళ్లి నీరు తెచ్చుకోవాలంటే ఐదు కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల బైక్ ఉన్నవారికీ కష్టంగా మారిందని, బైక్ లేని వారు మరింత ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బోర్ నీళ్లు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. తక్షణమే అధికారాలు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో ఖండ్‌గాం, భిక్నెల్లి, సిద్దాపూర్ గ్రామాల ప్రజలు కలిసి రోడ్లపై ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఖండ్‌గాం, భిక్నెల్లి గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article