హైదరాబాద్, బతుకమ్మ : బీఆర్ఎస్ కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా..
మాగంటి గోపీనాథ్ 1982లో టీడీపీలో చేరారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో (టీ)బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గోపీనాథ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
’జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, శోఖార్తులైన వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను‘ అని ఎమ్మెల్సీ కవిత ’ఎక్స్‘ వేదికగా సంతాపం తెలిపారు.
