. . . సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాలే కీలకం
జైపూర్, బతుకమ్మ :
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ప్రమాద కేసును జైపూర్ పోలీసులు సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల దృశ్యాల సహాయంతో ఛేదించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించి, డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీన రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మణ్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా, నజీర్‌పల్లి పైవంతెన సమీపంలో రహదారి దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జైపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. బృందం సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. దర్యాప్తులో ప్రమాదానికి కారణమైన వాహనం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన టీఎస్ 20 జెడ్ 0012 నంబర్ గల ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. బస్సు డ్రైవర్‌గా బెజ్జూర్‌కు చెందిన జంగిటి రాజేశ్‌ను పోలీసులు గుర్తించారు. ఆయన ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు, ప్రమాద సమయంలో బస్సు ఆసిఫాబాద్ నుంచి గోదావరిఖని వైపు ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. విచారణలో జంగిటి రాజేశ్ తన తప్పిదాన్ని ఒప్పుకున్నట్లు జైపూర్ ఎస్‌ఐ భూమేష్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కేసుకు సంబంధించిన తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
