. . . డీజీపీ కార్యాలయానికి అటాచ్
ఖమ్మం, బతుకమ్మ :
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐపై వివాహిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహ సమస్యతో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన మహిళతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేస్తానని నమ్మబలికి లైంగికంగా, మానసికంగా వేధించడంతో పాటు గర్భస్రావానికి కారణమయ్యాడనే ఆరోపణలపై సీఐ బానోత్ రాజు నాయక్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, 2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో, భర్త వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితురాలితో రాజు నాయక్ పరిచయం పెంచుకున్నాడు. ఫిర్యాదు పత్రంలో ఉన్న ఆమె వ్యక్తిగత ఫోన్ నంబర్‌ను ఉపయోగించి తరచూ ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా సంప్రదిస్తూ, చట్టపరంగా పూర్తి న్యాయం చేస్తానని నమ్మకం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలక్రమేణా తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఆమె విశ్వాసాన్ని సంపాదించుకున్నాడని, అనంతరం తన అధికారాన్ని ఉపయోగించి బాధితురాలి భర్తపై ఒత్తిడి తీసుకువచ్చి, ఇటీవల కోర్టు ద్వారా విడాకులు జరిగేలా చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విడాకుల అనంతరం సీఐపై పూర్తిగా నమ్మకం ఉంచిన బాధితురాలు గర్భవతి అయ్యిందని, ఆ తర్వాత తనను వివాహం చేసుకోవాలని కోరగా సీఐ నిరాకరించాడని ఆరోపించింది. అంతేకాకుండా, తనకు తెలియకుండా బలవంతంగా అబార్షన్ మాత్రలు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి గర్భస్రావం జరిగిందని, అనంతరం పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే చంపేస్తానంటూ బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈ నెల 7వ తేదీన ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రాథమిక విచారణలో, సీఐ రాజు నాయక్ బాధితురాలిని లైంగికంగా, మానసికంగా వేధించినట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. దీంతో సీఐ బానోత్ రాజు నాయక్‌పై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర చర్చకు దారితీయడంతో, ప్రస్తుతం ఖమ్మం సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న రాజు నాయక్‌ను తక్షణమే అక్కడి నుంచి బదిలీ చేస్తూ, హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, బాధితురాలికి పూర్తి స్థాయిలో చట్టపరమైన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
