చందూర్, బతుకమ్మ :
చందూర్ మండలంలోని కారేగాం తండా పరిధిలో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చేపట్టిన చందూర్ ఎత్తిపోతల పథకం ద్వారా మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందుబాటులోకి రావడంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చందూర్ ఎత్తిపోతల పథకం ద్వారా మండల పరిధిలో దాదాపు 3120 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టారు. ముఖ్యంగా వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్న మెట్ట ప్రాంత రైతులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.పథకంలో భాగంగా కారేగాం తండా పరిధిలోని 1200 ఎకరాల లక్ష్య విస్తీర్ణంలో ప్రస్తుతం సుమారు 300 ఎకరాల మెట్ట భూములకు సాగునీరు అందుతోంది. దీంతో ఎండిపోతున్న పంటలకు నీరు అందడంతో రైతులకు ఎంతో ఊరట లభించింది. ఎన్నో సంవత్సరాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు తమ పంటలను కాపాడుకునే అవకాశం ఏర్పడింది. మెట్ట ప్రాంతాలకు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ తమ సాగు అవసరాలను గుర్తించి చర్యలు తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డికి రైతన్నల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కారేగాం తండా సర్పంచ్ డా. రమావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న మా మెట్ట భూములకు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందడం ఎంతో సంతోషంగా ఉంది. మా పంటలకు నీరు అందించి రైతుల సాగుకు భరోసా కల్పించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి రైతన్నల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. చందూర్ ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మరింత విస్తీర్ణంలో సాగు పెరిగి,మెట్ట ప్రాంత రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు అందడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ పథకం ఎంతో దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టి బూత్ అధ్యక్షులు వసంత్ రావు, మెట్ట ప్రాంత రైతులు సర్థార్,రమేష్ ప్రతాప్, నారాయణ, రాములు, సంతోష్, విట్టల్ పాల్గోన్నారు.
