డోంకేశ్వర్, బతుకమ్మ : రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గురువారం డోంకేశ్వర్ మండలం లోని తొండకూర్, దత్తాపూర్ గ్రామాల్లో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజ్యాంగ పరిరక్షణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరచే ప్రయత్నాలు చేస్తోందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని అభివర్ణించారు. బీజేపీ నాయకులు సన్న బియ్య కార్యక్రమాన్ని తమ ఘనతగా చెప్పుకోవడం మానుకోవాలని హితువు చేశారు. మోదీ పథకం ఉంటే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సన్న బియ్యం ఇవ్వాలని సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భూమేశ్ రెడ్డి, మాజీ సర్పంచ్, గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు దాస గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ గంగాధర్, పంచాయతీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
