. . . నీకు దమ్ము దైర్యం ఉంటే ఆధారాలతో నిరూపించు
. . . జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు అవినీతి చేశారని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారని, దమ్ము, ధైర్యం ఉంటే అవినీతి చేశారని ఆధారాలతో నిరూపించాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పక్క కేంద్రంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ తో యువకులు రోడ్లపైకి వచ్చి ఢిల్లీలో ధర్నాలు చేస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలను మభ్య పెట్టడం మానుకోవాలని అన్నారు. యూరియా యాప్ అనేది కేవలం తెలంగాణలో మాత్రమే లేదని, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని రాష్ట్రాలలో యూరియా యాప్ ఉందని అన్నారు. దేశంలో నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే మిగతా రాష్ట్రాలలో బిజెపి ఉంది కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఏ విధంగా రాష్ట్రానికి యూరియా సరఫరా చేస్తే ఆ విధంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఒకేసారి యూరియాను రాష్ట్రానికి అందిస్తే జిల్లాలో యూరియా అందిస్తామని, యూరియా యాప్ ద్వారా ఒక ఎకరానికి ఒకేసారి రెండు బస్తాలు, మూడు ఎకరాలు ఉన్నవారికి రెండుసార్లు, ఐదు ఎకరాలు ఉన్నవారికి మూడుసార్లు, ఆపై ఉన్న వారికి నాలుగు దశల వారీగా యూరియా అందించడం జరుగుతుందని అన్నారు. యూరియా యాప్ కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చిందని గుర్తు చేశారు. యాప్ గురించి తెలియని వారి కోసం గ్రామస్థాయిలో గ్రామపంచాయతీలలో ఏఈఓలను మండల స్థాయిలో ఏఓలను పెట్టడం జరిగిందని అన్నారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు సుమారు 18 సంవత్సరాల క్రితం 2004 నుండి 2014 వరకు క్రూడ్ ఆయిల్ బారిల్ ధర 140 డాలర్లు ఉంటే డీజిల్ రూ.55, పెట్రోల్ రూ.65 ఉండేదని ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లు ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం విపరీతంగా పెంచుతున్నారని మండి పడ్డారు. లక్షల కోట్లు పేద ప్రజలపై భారం మోపడం జరిగిందని, ప్రతి ఇంటికి బైకులు ఉన్నాయని, రైతులకు ట్రాక్టర్లకు డీజిల్ ధరలు పెంచి రైతులను ముంచుతున్నారని, ఎక్కడ కూడా రైతులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ 12 ఏళ్లు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన అభివృద్ధి శూన్యమని, జవహర్లాల్ నెహ్రూ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారని ఆ సమయంలో దేశం గుండు పిన్ను కూడా తయారీ చేయలేని స్థితిలో ఉందని, కరెంటు, రోడ్లు, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి సరిగ్గా లేని రోజు నుండి 17 సంవత్సరాలు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని ప్రపంచ దేశాల స్థాయిలో అభివృద్ధిలో ఎదిగేలా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి పేదవాని అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తామని ఇప్పటికీ వేయలేదని నగేష్ రెడ్డి అన్నారు. 7 ఏండ్లు పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ పార్లమెంటుకు ఒక్క రూపాయి కూడా తీసుకు రాలేదని, రైల్వే బ్రిడ్జి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, పసుపు బోర్డు పేరుకే తీసుకువచ్చారు కానీ దానిలో అధికారులను నియమించలేదని, పసుపు బోర్డు ద్వారా పసుపు కు మద్దతు ధర ఇప్పించడంలో అరవింద్ విఫలమయ్యారని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా అందిస్తున్నామని ఆయనన్నారు. సీఎం నిజామాబాద్ జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను 600 కోట్ల నిధులతో మంజూరు చేశారని, అదే విధంగా వ్యవసాయ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేయడంలో మహేష్ కుమార్ గౌడ్ ఎంతో కృషి చేయడం జరిగిందని ఆయనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నామని, రూ. 500 కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని, ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని, రైతులకు రైతు రుణమాఫీ చేశామని, సన్నవడ్లకు 500 బోరస్ ఇస్తున్నామని, రైతు భరోసా అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి 10 లక్షల పెంచడం జరిగిందని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తున్నామని నగేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశ వేణు, రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, డిసిసి కోశాధికారి భక్తవస్థలం, డిసిసి ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేంధర్ గౌడ్, సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, డిసిసి కార్యదర్శి గణేష్, కరీంద్దీన్, మొయిన్, మహమ్మద్ వాలి తదితరులు పాల్గొన్నారు.