- గంజాయి స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీసులు అంతర్ రాష్ట్ర గంజాయి రవాణా చేస్తున్న ముఠాకు చెందిన నలుగురు మహారాష్ట్ర వాసులు, ముగ్గురు స్థానికులను అరెస్టు చేశారు. మోపాల్ మండలంలో తీగ లాగితే మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో డొంక కదిలిందని నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్ తెలిపారు. శుక్రవారం సౌత్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఈ నెల 20న మోపాల్ మండలం కంజర్ గ్రామ శివారులో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో మోపాల్ ఎస్సై సుష్మిత తన సిబ్బందితో దాడి చేసి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వినాయక్ నగర్ కు చెందిన గ్యాస్ వెల్డర్ అమీర్ ఖాన్, మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామ పంచాయితీ వర్కర్ షేక్ అప్రోజ్, కంజర్ గ్రామానికి చెందిన బసంత్ శివతేజలను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు నాందేడ్ కు ట్రైన్ లలో వెళ్లి అక్కడ గంజాయిని తీసుకువచ్చి స్థానిక మోపాల్ మండలం చుట్టు ప్రక్కల ప్రాంతంలో ఐదు గ్రాముల చొప్పున గంజాయి విక్రయిస్తున్నట్లు అంగీకరించడంతో వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు యువకులు ఇచ్చిన సమాచారంతో మోపాల్ ఎస్సై సుస్మిత తన సిబ్బందితో కలిసి నాందేడ్ జిల్లా శివాజినగర్ కు చెందిన జ్యూస్ సెంటర్ నిర్వాహకుడు షేక్ ఇమ్రాన్, బిలాల్ నగర్ కు చెందిన మీర్జా జుబేర్ బేగ్, సరస్వతినగర్ కు చెందిన ఆటో డ్రైవర్ అముల్ కౌర్, మరో ఆటో డ్రైవర్ షేక్ షేర్ ఖాన్ లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నిజామాబాద్ కు చెందిన యువకులు కిలో రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి 900 గ్రాముల గంజాయిని, 4 మోబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురిని కోర్టులో హాజరుపరుస్తామని సిఐ తెలిపారు. నిషేదిత గంజాయి, డ్రగ్స్ ను అమ్మవద్దని, కొనవద్దని సిఐ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మోపాల్ ఎస్సై సుష్మిత సిబ్బంది ఉన్నారు.
