- రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఎన్ఎస్ఎస్ క్యాంపు ద్వారా స్నేహభావంతో పాటు సమగ్రత ఏర్పడుతుందని టీజీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి అన్నారు. తెలంగాణ యునివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ 1, 4 ల ఆధ్వర్యంలో సుద్దపల్లి నిర్వహిస్తున్న వారం రోజుల క్యాంపు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ ఎన్ స్వప్న, డాక్టర్ స్రవంతి లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు. క్యాంపులో భాగంగా విద్యార్థులు గ్రామంలో జరిపిన విస్తృత సర్వేలో బహిర్గతమైన అంశాలకు, పరిష్కారాలను చర్చించి ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలన్నారు. ఈ క్యాంపు ద్వారా విద్యార్థులలో స్నేహభావంతో పాటు సమగ్రత ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ గ్రామ ప్రజలను చైతన్యపరిచి, మూఢవిశ్వాసాల పట్ల అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. కో- ఆర్డినేటర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సహజ వనరులను రక్షించాలన్నారు. వాలంటీర్లు వారం రోజులుగా నిర్వహించిన కార్యక్రమాల వివరాలను ప్రోగ్రాం ఆఫీసర్లు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ యెహాన్, ఎంపీడీఓ నివేదిత, ప్రభకర్, శ్రీనివాస్ గౌడ్ , పంచాయత్ సెక్రటరీ కవిత , వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

