26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సాలురాలో తీగ లాగితే సతారాలో డొంక కదిలింది

Must read

📰 Generate e-Paper Clip

  • మహారాష్ట్రలో అల్ర్పాజోలం తయారి
  • నిజామాబాద్ కల్లు తయారిలో వినియోగం
  • మహారాష్ట్రకు చెందిన నలుగురు పట్టివేత
  • నిజామాబాద్ కు చెందిన సూత్రదారి అరెస్టు
  • పరారీలో నలుగురు

 

జామాబాద్, బతుకమ్మ: కల్తీ ( మత్తు) కల్లు  తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న నిషేదిత మత్తు పధార్థాలపై నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సీరియస్ గా ఉన్నారు.  నిజామాబాద్ పోలీస్ కమీషనర్ గా  రాక మునుపు యాంటి నార్కోటిక్స్ విభాగంలో ఎస్పీగా పని చేసిన అనుభవంలో జిల్లాలో మత్తు పధార్థాల రవాణాపై ప్రత్యేకంగా నజర్ వేసి ఫలితాల దిశలో అడుగులు వేస్తున్నారు. నిజామాబాద్  ఉమ్మడి జిల్లా మత్తు కల్లు బాధితులకు అడ్డాగా ఉండటంతో కల్లుడిపోలకు (కృత్రిమ రసాయినాల)తో తయారి కర్మాగారాలకు నిషేదిత అల్ర్పజోలం రవాణాపై ఉక్కుపాధం మోపుతామని నిజామాబాద్ సీపీగా భాధ్యతలు స్వీకరించిన సమయంలో ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా నిజామాబాద్ పోలీసులు, నార్కోటిక్  విభాగం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి ఐదుగురు అంతర్ రాష్ట్ర అల్ర్పజోలం రవాణా ముఠాను పట్టుకున్నట్టు నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య శుక్రవారం బోధన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా సాలురా మండల కేంద్రానికి చెందిన మల్లెపూల లక్ష్మణ్ గౌడ్ కల్లు వ్యాపారం చేస్తున్నాడు. అతనికి సాలురాకు చెందిన మరో కల్లు తయారిలో వాడే మత్తు పదార్థాలను రవాణా చేసే పాత్రదారితో పాటు  నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన ఒకరు, మోర్తాడ్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి కలిసి ఏడాదిన్నర కాలంగా మహారాష్ట్ర నుంచి నిషేదిత మత్తు పదార్థమైన అల్ర్పాజోలంను తీసుకువచ్చి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కల్లుడిపోలకు సరఫరా చేస్తున్నారు. అత్యంత ఖరీదైనదిగా, డెంజరస్ డ్రగ్ గా పేరు గాంచిన అల్ర్పాజోలంను నిత్యం రవాణా చేస్తూ కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అమర్ సింగ్ దేశ్ ముఖ్ సూర్యప్రభ ఫార్మా కెమికల్ నడుపుతున్నాడు. వ్యవసాయానికి అవసరమైన ఎరువులను ఉత్పత్తి చేస్తున్నానని చెబుతూనే అతను రెండు సంవత్సరాల క్రితం అహ్మద్ నగర్ లో బ్లీచ్, సౌందర్య సాదనాలకు ఉపయోగించే రాశి ట్రేడర్ కెమికల్ యజమాని అయిన విశ్వనాథ శంకర్ తో పరిచయం పెంచుకున్నాడు. మహారాష్ట్రలోని పూణెలోని చించ్ వాడ్ స్టేషన్ వద్ద ఉండే బాబురావు బస్వారాజ్ కడేరి అనే వ్యక్తి సహాయంతో అల్ప్రాజోలం తయారిని ప్రారంభించారు. అక్కడ తయారైన అల్ప్రాజోలంను నిజామాబాద్ జిల్లాలో కల్లులో కలిపేందుకు సాలురాకు చెందిన మల్లేపూల లక్ష్మణ్ గౌడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా ఉమెర్గా తాలుకాలోని గుంజోటి గ్రామానికి చెందిన షబ్బీర్ ఆలీ పాషామియా చౌదరి,  ఫూణెకు చెందిన పరమేశ్వర్ విజయ్ బర్దడే అనే వ్యక్తితో కలిసి అల్ప్రాజోలంను మల్లేపూల లక్ష్మణ్ గౌడ్ కు విక్రయించేవారు. ఈ దందా ఏడాదిన్నర కాలంగా సాగుతుంది. ఈ నెల 15న రాత్రి 11 గంటల ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన అమర్ సింగ్ దేశ్ ముఖ్, బాబురావు బస్వరాజ్ కడేరి, షబ్బీర్ ఆలీ పాషామియా చౌదరి, పరమేశ్వర్ విజయ్ బర్ధడేలు కలిసి ఎంహెచ్ 14 హెడి 7889 కారులో 2.5 కిలోల అల్ర్పాజోలంను రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. నిజామాబాద్ యాంటీ నార్కోటిక్ బ్యూరో టీంతో పాటు , బోధన్ రూరల్ పోలీసులు పకడ్బందీ పథకం ప్రకారం సాలురా మండలంలోని ఒంటిమిట్ట హనుమాన్ జంక్షన్ వద్ద నలుగురు కలిసి మల్లేపూల లక్ష్మణ్ గౌడ్ కు రూ.25 లక్షల విలువైన అల్ప్రాజోలంను అందిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 8 సెల్ ఫోన్లు, రూ.2 లక్షల 50 వేల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో నలుగురు పరారీ అయినట్లు సీపీ తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో విస్తరించి ఉన్న కల్తీ కల్లు మాఫియాకు డెంజర్ డ్రగ్ గా పేరు గాంచిన అల్ర్ర్పాజోలంను కొన్ని ముఠాలు నిత్యం సరఫరా చేస్తున్నాయి. సహజసిద్దమైన కల్లు స్థానంలో కృత్రిమ రసాయానాలతో కూడిన కల్లును తయారు చేసే దందా పరిశ్రమ కంటే ఎక్కువగా విస్తరించింది. నిత్యం ఉమ్మడి జిల్లాలో ఉన్న 200 పైచిలుకు డిపోలలో కల్లు తయారవుతుండగా అందులో అల్ర్పాజోలం, క్లోరోఫాం, డైజోఫాం లాంటి మత్తు పదార్థాలను కలిపి తయారు చేస్తున్నారు. జిల్లాలో పోలీసు శాఖతో పాటు ఎక్సైజ్ శాఖ కల్తీకల్లు తయారి కట్టడిలో విఫలం కావడంతో తెలంగాణ యాంటి నార్కోటిక్ బ్యూరో రంగంలోకి దిగింది. దాని ద్వారానే గురువారం రాత్రి ఐదుగురు ముఠా సభ్యులను పట్టుకున్నారు. మరో నలుగురు పరారీలో ఉండగా అల్ర్పాజోలం నిజామాబాద్ జిల్లాలోని కల్లుడిపోలలో తయారయ్యే సీసాలు, కల్లు ప్యాకెట్ల ద్వారా బట్టిలలో అమ్మకాలు జరిగి అమాయకులైన ప్రజలను మత్తుకల్లుకు బానిసలు చేశారని మరోసారి రుజువైంది.

More articles

Latest article