29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

వ్యవసాయ శాఖలో ఆరుగంటల సుదీర్ఘ విచారణ

Must read

📰 Generate e-Paper Clip

  • జేడిఏ, ఏడిఏ కార్యాలయంలో విచారణ జరిపిన ఎంక్వైరి కమిషన్
  • బాధితులకు న్యాయం చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషన్ కు టీజీవో వినతి

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ శాఖ రూరల్ ఏడిఏ ప్రదీప్ పై ఆరోపణలు, నిర్లక్ష్య విధులు, వేదింపులపై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ జరిపారు. రెండు రోజుల క్రితం నిజామాబాద్ రూరల్ ఏడిఏ ప్రదీప్ పై గతంలో ధర్పల్లి ఏవోగా పని చేసిన ప్రవీణ్ గుండెపోటుతో మరణించగా అతని కుటుంబానికి ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రయోజనాలు అందించడంలో నిర్లక్ష్యం చేయడం, వేదింపులకు పాల్పడ్డారని బాధితులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన విషయం విధితమే. బాధిత కుటుంబం జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయాధికారులు, టీజీవోలు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి గురువారం ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. జిల్లా కలెక్టర్ ఉన్నఫళంగా వ్యవసాయ శాఖ కమిషనర్ కు సంబంధిత ఆరోపణలు, నిర్లక్ష్య విధులపై విచారణ జరుపాలని కోరారు. కమిషనర్ ఆదేశాల మేరకు ప్రదిఫ్ పై విచారణకు అధికారులుగా  వ్యవసాయ శాఖ జాయింట్  డైరెక్టర్ బి. సింగారెడ్డి,జూనియర్ అకౌంట్స్ ఆఫిసర్  శివాజీ పాటిల్ ను కమీషన్ సభ్యులుగా నియమించారు. శుక్రవారం ఇద్దరు సభ్యుల కమిషన్ జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంతో పాటు రూరల్ ఏడిఏ కార్యాలయంలో విచారణ జరిపారు. మధ్యాహ్నం ప్రారంభమైన విచారణ రాత్రి వరకు కొనసాగింది. జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయంతో పాటు రూరల్ ఏడిఏ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులను కమిషన్ సభ్యులు ఒక్కొక్కరిగా పిలిచి విచారణ జరిపారు. టీజీవో అధ్యక్ష, కార్యదర్శులు అలుక కిషన్, అమృత్ కుమార్ ఆధ్వర్యంలో  ప్రవీణ్ కుటుంబ సభ్యులు, మండల వ్యవసాయాధికారులు ఎంక్వైరి కమిషన్ అధికారులను కలిసారు. విధి నిర్వహణలో, అధికారుల ఒత్తిడితో గుండెపోటుతో చనిపోయిన మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అదే విధంగా వేదింపులకు పాల్పడి నిర్లక్ష్య విధులు నిర్వహించిన ఏడిఏ ప్రదీప్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ మండల వ్యవసాయాధికారుల సంఘం, ప్రవీణ్ కుటుంబ సభ్యులు, టీజీవో బాధ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు ఎంక్వైరి కమిషన్ సభ్యులు సింగారెడ్డి, శివాజి పాటిల్ లు తెలిపారు. సంబంధిత నివేదికను వ్యవసాయ కమిషనర్ కు అందజేస్తామని తెలిపారు. ఇది వరకే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఈ విషయంలో జేసీ ద్వారా విచారణ జరిపిన విషయం విధితమే. ప్రస్తుతం వ్యవసాయ కమిషనర్ ఆదేశాలతో ఎంక్వైరి కమిషన్ సభ్యుల విచారణ నివేదిక ప్రకారం ఏడిఏపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.

More articles

Latest article