. . . మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని
ఏర్గట్ల, బతుకమ్మ :
దృఢంగా నమ్మి కష్టపడితే కచ్చితంగా విజయం సాధించవచ్చని, ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేసినందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానని మెండోరా పోలీస్ స్టేషన్ ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపారు. ఏర్గట్ల లోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో నిర్వహించిన ఇంటర్ నేషనల్ ఆఫ్ గర్ల్ స్టూడెంట్స్ విత్ రోల్ మోడల్ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా హాజరై ఎస్సై సుహాసిని ప్రసంగించారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని అన్నారు. విద్యార్థులంతా ఉన్నత చదువులు చదవాలని మెండోరా ఎస్సై పిలుపునిచ్చారు. ముఖ్యంగా బాలికలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ ప్రపంచంలో లక్ష్యమంటూ లేని మనిషి ఉండడని, కానీ ఆ లక్ష్యాలు పెడదారిన పట్టే విధంగా ఉండకూడదని పేర్కొన్నారు. లక్ష్యం ఎప్పుడూ గొప్పగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా తాను జీవితంలో పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయిని పి జ్యోతి, భావోద్వేగానికి గురి అయ్యారు. చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చామని విద్యార్థులకు వివరించారు. అనంతరం మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని ని ప్రధానోపాధ్యాయుడు కృష్ణ చారి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రసాద్, సమిత, ఎస్ శ్రీనివాస్, విజయ్,రాజేందర్, రాజనర్సయ్య, గంగాధర్, కె శ్రీనివాస్, జ్యోతి, ట్వింకిల్ కుమార్, నరేష్, గంగ మోహన్, కోమలి, రిషిక, కృష్ణవేణి, శ్రీలత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
