నిజామాబాద్, బతుకమ్మ : భార్యను శరీరకంగా, మానసికంగా వేధించి కత్తితో గాయపరచి హత్యాయత్నం చేసిన భర్తకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ బుధవారం తీర్పు చెప్పారు.నిజామాబాద్ నగర ఒకటవ టౌన్ పోలీసు అధికారి కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణలో భాగంగా పన్నెండు మంది సాక్షుల వాంగ్మూలాలు, ఆరు ధ్రువీకరించుకున్న పత్రాలు, రెండు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసి అధ్యయనం చేసిన అనంతరం ముప్పై రెండు పేజీల కోర్టుతీర్పులోని వివరాలు.. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలోని నివాసురాలైన తురేకార్ రాజమణి కి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన సోన్ కాంబ్లె యాదవ్ తో 2018 లో వివాహం జరిగింది. దాంపత్య జీవనంలో వీరికి ఒక కూతురు జన్మించింది. బాలిక అనారోగ్యంతో మృతి చెందింది. కాంబ్లె కు మద్యం తాగుతు జల్సాగా తిరిగే అలవాటు, పనిపాట లేకుండా చేయకుండా ఉండేవాడు. భార్య సంపాదనపై అదారపడేవాడు. ఆమె నిజామాబాద్ లోని మనోరమ దావాఖాన నందు నర్సుగా విధులు నిర్వహిస్తు కుటుంబాన్ని పోషించేది.27 మే, 2021 న మనోరమ దావఖానకుకు వెళ్లిన కాంబ్లె ఆపరేషన్ థియేటర్ దగ్గరలోని డ్రెస్సింగ్ రూమ్ కు వెల్లి రాజమణిని తనతోపాటు రావాలని గొడవ చేశాడు.మద్యం మానేసి మంచి మనిషిగా మారాలని, నీతో వచ్చేది లేదని ఆమె తెలిపింది. భార్య తన దగ్గరకు రావటం లేదని, కలిసి ఉండటం లేదని మనసులో కక్ష పెంచుకున్న కాంబ్లె తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె మేడకోసి హత్యయత్నం చేశాడు. అడ్డుకోబోయిన ఆమె చేతికి కూడా గాయం అయింది. ముద్దాయిపై నేరారోపణ రుజువైనట్లు నిర్దారిస్తూ భారత శిక్షస్కృతి సెక్షన్ 307 హత్యయత్నం ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష తో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా నెల రోజుల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి సాయిసుధ తమ తీర్పులో పేర్కొన్నారు.
