ప్రజల్లో ఉనికి కోసమే నిరాహార దీక్ష

0 9,604

 

. . . డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడం కోసమే ప్రశాంత్ రెడ్డి దీక్ష చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. భీంగల్ పట్టణంలో 2022 జూన్ 2న రూ.35 కోట్ల వ్యయంతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసి మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పినా, 18 నెలల పాటు పనులు నత్తనడకన సాగాయని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. చివరకు రూ.17 కోట్ల మేర పనులు మాత్రమే పూర్తయ్యాయని అన్నారు. అలాగే సుమారు రూ.6 కోట్లతో చేపల మార్కెట్ మంజూరు చేసుకొని 18 నెలల్లో రూ.1.5 కోట్ల పనులు మాత్రమే చేశారని ఆరోపించారు. పురాతన తహసీల్ కార్యాలయాన్ని కూల్చివేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా 2 కిలోమీటర్ల దూరంలోని ఎస్టీ హాస్టల్‌లోకి మార్చారని విమర్శించారు. రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేసుకున్నప్పటికీ రూ.17 కోట్ల మేర పనులే జరిగాయని తెలిపారు. మిగిలిన పనులకు నిధులు సమకూర్చేందుకు మహేష్ కుమార్ గౌడ్ సహకరించారని, మరికొన్ని బిల్లులు కూడా త్వరలో ఇప్పిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో సచివాలయ నిర్మాణానికి రూ.1000 కోట్ల వరకు నిధులు కేటాయించి తొమ్మిది నెలల్లో పూర్తి చేసినప్పుడు, బాల్కొండ నియోజకవర్గంలో రూ.50 కోట్ల విలువైన పనులను 18 నెలల్లో ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. పనులను ఆలస్యం చేసి ఇప్పుడు కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గత ఎన్నికల విజయాలను ప్రస్తావిస్తూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 75 శాతం విజయాలు సాధించిందని, భీంగల్ మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధించి పాలక పీఠాన్ని దక్కించుకున్నామని తెలిపారు. సునీల్ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్‌లో ఎనిమిది స్థానాలు గెలుచుకుని చైర్మన్ పదవిని కైవసం చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రశాంత్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉండి నిజామాబాద్ జిల్లాకు ఏమి చేశారని నగేష్ రెడ్డి ప్రశ్నించారు. బైపాస్ రోడ్డు పనులు కూడా నత్తనడకన సాగాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులపై కూడా ఆయన విమర్శలు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ మార్పులు, భారీ వ్యయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. మంచిప్ప ప్యాకేజీ పనులు కూడా ఆలస్యమయ్యాయని, తక్కువ నిధులతో పూర్తి చేయగలిగిన పనులను మరింత పెంచారని ఆరోపించారు. మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఆ అంశాలపై ప్రశాంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, అర్హులకు రేషన్ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, రైతులకు పంట భూముల ఆధారంగా రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో దళిత బంధులో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. భీంగల్ పట్టణ అభివృద్ధికి అదనంగా రూ.15 కోట్లు, లింబాద్రి గుట్ట అభివృద్ధికి రూ.4 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ప్రశాంత్ రెడ్డి దీక్ష చేపట్టారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని నగేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నింటినీ ఐదేళ్ల కాలంలో దశలవారీగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, గాదరి గోపి, కోశాధికారి భక్తవత్సలం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జావీద్ అక్రం, స్పోక్స్ పర్సన్ లింగన్న, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు నరేందర్ గౌడ్, బాల నర్సయ్య, రవి, గణేష్, పూర్ణచందర్, కిష్టా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.