. . . తోటి కానిస్టేబుల్ పై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
. . . అడ్డుకుంటున్న షాడో అధికారి
. . . సెటిల్ మెంట్ చేసుకోవాలని బెదిరింపులు
. . . కేసు నమోదు చేయాలంటున్న బాధితురాలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో అతిపెద్ద పోలీస్ స్టేషన్ లో ఇటీవల కొత్తగా రిక్రూట్ అయిన మహిళా కానిస్టేబుల్ ను సీనియర్ కానిస్టేబుల్ వేదింపుల వ్యవహరం వెలుగులోకి వచ్చింది. విధి నిర్వహణలో భాగంగా కంప్యూటర్ పై వాట్సాప్ వెబ్ ద్వారా వర్క్ చేసిన మహిళ కానిస్టేబుల్ పొరపాటున లాగ్ అవుట్ చేయకపోవడం కొంప ముంచింది. మహిళ కానిస్టేబుల్ విధుల నుంచి వెళ్లిన తర్వాత సంబంధిత సిస్టంపై కూర్చున్న ముదురు కానిస్టేబుల్ ఆమె వాట్సాప్ చాట్ ను పక్కాగా సేవ్ చేశాడు. అప్పటి వరకు మహిళ కానిస్టేబుల్ తన సన్నిహితులతో చేసిన చాటింగ్ ను సేవ్ చేసి వెకిలి చేష్టలతో కొన్నిరోజుల పాటు వేదించాడు. అయినప్పటికీ సదరు ఆ వివాహిత అయిన సదరు కానిస్టేబుల్ సీనియర్ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ చాటింగ్ లో మహిళ కానిస్టేబుల్ వాడిన పదాలను ద్వంద అర్థాలతో వాడుతూ వేదింపులకు దిగాడు. ఏకంగా తనతో ఏకాంతంగా కలువాలని డిమాండ్ ను పెట్టాడు. దాంతో షాక్ కి గురైన మహిళ కంప్యూటర్ సిస్టంలో చూడగా తన వాట్సాప్ బ్యాక్ అప్ ద్వారా తన సన్నిహితులతో చేసిన చాటింగ్ ద్వారానే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న విషయాన్ని గుర్తించింది. ఈ విషయాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్ పెక్టర్ కు ఫిర్యాదు చేసింది. అయితే ముదురు కానిస్టేబుల్ విషయంలో ఎస్ హెచ్ వో చేతులెత్తేశాడు. దానితో బాధితురాలు పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారిని మహిళ కానిస్టేబుల్ రెండుసార్లు కలిసేందుకు యత్నించిన అవకాశం దక్కలేదు. అయితే మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదును ప్రత్యేక విభాగం ఎస్సై వద్దకు చేరింది. పోలీసు శాఖలో ఒక ముదురు ఎస్సై అంతా తానే షాడో అధికారిగా చెలామణి అవుతూ చాలా వేదింపుల కేసులను పక్కదారి పట్టించిన విషయం తెల్సిందే. సదరు షాడో వద్దకు మహిళ కానిస్టేబుల్ ఫిర్యాదు వెళ్లగా ఫిర్యాదు వద్దని కానిస్టేబుల్ తో కాళ్ళు మొక్కిస్తానని సెటిల్ మెంట్ చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. అయితే తాను మానసిక క్షోభ అనుభవించానని, తన లాగా మరో ఉద్యోగికి అలా కాకూడదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోయినా పర్వాలేదని జీడీ (జనరల్ డ్యూటీ డైరీ)లో ఎంట్రీ చేయాలని కోరింది. కానీ ఆమె ఆవేదనను పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లా కేంద్రంలో మహిళా కానిస్టేబుల్ కు వేదింపులు జరిగితే న్యాయం చేయాల్సిన అధికారులు సెటిల్ మెంట్ చేసుకోవాలని ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా కానిస్టేబుల్ ను కాపాడేందుకు యత్నించడం వివాదాస్పదమైంది. దీనిపై పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
