. . . జాతీయ జెండాల పంపిణీ, పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు
తిమ్మాపూర్, బతుకమ్మ :
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తిమ్మాపూర్ గ్రామంలో సర్పంచ్ పుప్పాల నరేష్ అధ్యక్షతన గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో గ్రామస్తులకు ఇంటింటికీ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తడి చెత్త, పొడి చెత్త, సానిటరీ చెత్త, ప్రత్యేక జాగ్రత్తలతో నిర్వహించాల్సిన చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి సేకరించే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు గ్రామసభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగించిన వారికి రూ.5,000 జరిమానా విధించేలా గ్రామసభ తీర్మానం చేసినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ పక్కాగా అమలు చేస్తోందని సర్పంచ్ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ, ప్రతి పథకాన్ని క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సదానంద్, పంచాయతీ కార్యదర్శి బాస నరేందర్, పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల గ్రామస్థాయి అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

