నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును శుక్రవారం కోరారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల 29 వేల ఎకరాలలో వరిసాగు చేశారని, ఇప్పటివరకు లక్ష ఎకరాలలో రైతులు వరి పంట కోసారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఇంకా ఏర్పాటు చేయలేదని అన్నారు. కేవలం మొక్కుబడిగా ఇప్పటివరకు జిల్లాలో 150 కొనుగోలు కేంద్రాలకు కొబ్బరికాయలు కొట్టారు, కానీ కొనుగోలు ఇంకా ప్రారంభించలేదని తెలిపారు. రైతులు కోసిన దాన్యాన్ని నిల్వచేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రోడ్లపై కుప్పలుగా ఉంచడం వల్ల, అకాల వర్షాల కారణంగా రోడ్లపై ఉన్న ధాన్యం తడిసి మొలకెత్తుతోందని అన్నారు. ఈ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అకాల వర్షాల వల్ల పంట నేలకు ఒరిగి, ఆర్థికంగా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పటు చేయాలని డిమాండ్ చేశారు.