. . . వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రుల సమీక్ష
నిజామాబాద్అర్బన్, బతుకమ్మ :
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు జిల్లా యంత్రాంగాలకు సూచించారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల సంస్థ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో కలిసి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సోమవారం వరి ధాన్యం సేకరణ అంశంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. రాబోయే ఐదు రోజులలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొనుగోలు చేసిన వరి ధాన్యం వర్షాలకు తడవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం నిల్వలను తక్షణమే కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులు, గోదాములకు తరలించాలని అన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తగినంత సంఖ్యలో టార్పాలిన్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో నీరు నిల్వ ఉండకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకునేలా చూడాలన్నారు.అకాల వర్షాల సమయంలో పీపీసీల వద్ద 24 గంటలు పర్యవేక్షణ కొనసాగించాలని, అత్యవసర తరలింపుల కోసం తగిన సిబ్బంది, వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. వరి తరలింపులో అంతరాయం లేకుండా రైస్ మిల్లర్లు, రవాణా సంస్థలతో సమన్వయం కొనసాగించాలని సూచించారు, రైతుల ప్రయోజనాలను కాపాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సజావుగా, సమర్థవంతంగా వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగేలా కృషి చేయాలని, రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను కొనేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డీఆర్డీఓ సాయన్న, డీసీఓ శ్రీనివాస్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ అధికారి గంగవ్వ తదితరులు పాల్గొన్నారు.

