లింగంపేట్, బతుకమ్మ :
ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రా ఆర్థిక సహాయం అందించారు. లింగంపేట్ మండలం అయ్యపల్లి తండాకు చెందిన నిఖిత ఆర్‌జీయూకేటీ (బాసర్) ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొందింది. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక సహాయం కావాలంటూ ఆమె సమర్పించిన వినతిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్పందించి, శనివారం తన కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.10 వేల విలువైన చెక్కును విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలో నిలిపివేయకుండా పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అందించిన ఆర్థిక సహాయం పుస్తకాలు, అధ్యయన సామగ్రి, ప్రయాణం తదితర విద్యా అవసరాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన జిల్లా కలెక్టర్‌కు విద్యార్థిని నిఖిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తన ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు రాజన్న, నరసింహులు, విద్యార్థిని నిఖిత తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
