24.7 C
Hyderabad
Monday, August 3, 2026

రైతు బజార్‌ లను వినియోగించుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • నగరంలోని రైతు బజార్ లను సందర్శించిన కలెక్టర్

 

నిజామాబాద్, బతుకమ్మ :   రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, వినియోగదారులకు నేరుగా తక్కువ ధరలకే కూరగాయలు, పండ్లను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్ లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్, వీక్లీ మార్కెట్, సుభాష్ నగర్, శివాజీ నగర్ ప్రాంతాలలోని రైతు బజార్ లను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. వీటితో పాటు హమాల్వాడిలోని వీధి వ్యాపారుల వర్తక సముదాయం, పాత గంజులో కొనసాగుతున్న మార్కెట్ లను, ఖలీల్ వాడిలో నిర్మితం అవుతున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని  పరిశీలించారు. చాలా చోట్ల రైతు బజార్లను కూరగాయల విక్రేతలు వినియోగించడం లేదని గమనించిన కలెక్టర్, అందుకు గల కారణాలను ఆరా తీశారు. వినియోగదారులు రైతు బజార్ల లోపలికి రావడం లేదని, రోడ్లకు ఆనుకుని ఇరువైపుల గల దుకాణాల నుండే కూరగాయలు కొంటున్నారని, దీనివల్ల తాము కూడా రోడ్ల పక్కన అమ్మకాలు జరపాల్సి వస్తోందని పలువురు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే, రోడ్ల పక్కన విక్రయాలు జరపడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని, పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వినియోగించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. కూరగాయలు, పండ్ల విక్రేతలు అందరూ రోడ్ల పక్కన కాకుండా రైతు బజార్ లలో అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్ణీత ధరలకు అమ్మకాలు, నాణ్యత, శుభ్రత వంటివి పాటిస్తూ, అందరూ రైతు బజార్లలోనే విక్రయాలు జరిపితే, వినియోగదారులు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తారని అన్నారు. ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ వసతులు తదితర అంశాల గురించి కలెక్టర్ అధికారులతో చర్చించి, సూచనలు చేశారు.

Farmers' markets should be used.

మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా వినియోగదారులకు తాజా కూరగాయలు అందేందుకు రైతు బజార్లు వేదికగా నిలవాలని సూచించారు. రైతు బజార్ల అభివృద్ధికి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్, మార్కెటింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. పాత గంజు ప్రాంతంలో ఆక్రమణలను గుర్తించి, వాటిని తొలగించేందుకు డీ-మార్కింగ్ చేయాలని సూచించారు. అన్ని రైతు బజార్లు ఉపయోగంలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అమృత్ పథకం కింద తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు నగరంలోని నాందేవ్ వాడ, గౌతంనగర్ లలో కొనసాగుతున్న మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. పనులు మందకొడిగా సాగడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను వేగంగా చేపట్టాలని కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అంతకుముందు నాగారం 300 క్వార్టర్స్ లోని బస్తీ దవాఖానను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు ఉన్నారు.

Farmers' markets should be used.

More articles

Latest article