. . . మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్, బతుకమ్మ :
రానున్న 2026–27 పత్తి సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సీసీఐ అధికారులతో హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పంట పండించిన రైతులకు మార్కెటింగ్‌లో ఎక్కడా ఇబ్బంది కలగకూడదని, ఒకరిద్దరి నిర్లక్ష్యం కారణంగా మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు రాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. “మనం బతకాలంటే రైతు బతకాలి” అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుని పనిచేయాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు వెళ్లి పత్తి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పంట కోతకు దాదాపు రెండు నెలల ముందుగానే పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. తెలంగాణలో ప్రకృతిపై ఆధారపడి పత్తి సాగు చేసే రైతుల్లో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉన్నందున వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను ముందుగానే పకడ్బందీగా సిద్ధం చేయాలని ఆదేశించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో మధ్యవర్తుల జోక్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నుంచి నేరుగా, పారదర్శకంగా పత్తి కొనుగోలు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. గత సీజన్లలో పత్తి కొనుగోళ్లపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం గుర్తించిన అంశాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుని ఈ సీజన్‌లో లోపాలు, అవకతవకలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2026–27 సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని, సుమారు 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ఈ సీజన్‌కు లాంగ్ స్టేపుల్ కాటన్‌కు కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8,667 కనీస మద్దతు ధర ప్రకటించిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.557 ఎంఎస్ పి పెరిగిందని చెప్పారు. ప్రతి అర్హత కలిగిన రైతుకు ఎంఎస్ పీ ప్రయోజనం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు ఎంఎస్ పి కంటే తక్కువ ధరకు పత్తిని విక్రయించే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని ఆదేశించారు. రాష్ట్రంలోని 356 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా ఎల్ 1 నుంచి ఎల్ 12 వరకు అన్ని కేటగిరీల మిల్లులను అవసరానికి అనుగుణంగా ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలో అన్ని జిల్లాల్లో మిల్లులు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. గత సీజన్‌లో 122 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఉండగా, ఈ సీజన్‌లో వాటి సంఖ్యను 131 కేంద్రాలకు పెంచినట్లు తెలిపారు. అన్ని కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, మార్కెట్‌కు పత్తి రాక అధికంగా ఉండే ప్రాంతాల్లో అవసరమైన మేరకు అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఒక ప్రాంతంలో జిన్నింగ్ మిల్లు అందుబాటులో లేకపోతే సంబంధిత గ్రామాలు, మండలాలను సమీపంలోని నోటిఫైడ్ మిల్లుకు అనుసంధానం చేసి రైతులు ఎక్కువ దూరం ప్రయాణించకుండా చూడాలని అన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని మంత్రి ఆదేశించారు. ఈ కమిటీల్లో రైతు ప్రతినిధులను కూడా చేర్చుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల వద్ద పత్తి రాకను క్రమబద్ధీకరించాలని, అవసరమైతే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా కొనుగోలు సమయాన్ని స్థానిక కమిటీలు పరిస్థితులకు అనుగుణంగా పొడిగించాలని చెప్పారు. జిల్లాస్థాయి అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను స్వయంగా పర్యవేక్షించి రైతులకు ఎదురవుతున్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్లు ఓపెన్ చేసే ముందు సంబంధిత జిల్లా కలెక్టర్, జిల్లా మార్కెటింగ్ అధికారులకు సమాచారం అందించి రైతులకు విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి సూచించారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సరళీకృతం చేసి ఒక రైతు లేదా మొబైల్ నంబర్‌కు అవసరమైన విధంగా మల్టిపుల్ బార్‌కోడ్ సౌకర్యం కల్పించాలని అన్నారు. పంట బుకింగ్ డేటాను ఎన్ఐసీ ద్వారా కపాస్ కిసాన్ యాప్‌కు అత్యంత వేగంగా బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర సగటు దిగుబడిని ప్రకటించి, దానికంటే అధిక దిగుబడి పొందిన రైతులకు ఏఈఓ ల ద్వారా డిజిటల్ యీల్డ్ సర్టిఫికెట్స్ వెంటనే జారీ చేయాలని మంత్రి సూచించారు. దీనివల్ల అధిక దిగుబడి సాధించిన రైతుల పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని అన్నారు. పత్తి అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రధాన జిల్లాల్లో అవసరమైన మేరకు కాటన్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లుల్లో స్టెపుల్ లెంగ్త్, మైక్రోనెయిర్, తేమశాతం తదితర నాణ్యత ప్రమాణాలను పరీక్షించే పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని చెప్పారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సీసీటీవీ లు తప్పనిసరిగా పనిచేసేలా చూడటంతో పాటు బరువు కొలిచే యంత్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులకు ఎంఎస్ పీ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. రైతు నేస్తం, గ్రామస్థాయి కార్యక్రమాలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ఎంఎస్ పీ, కొనుగోలు కేంద్రాలు, నాణ్యత ప్రమాణాలు, స్లాట్ బుకింగ్ విధానం తదితర అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. రైతుల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన 1800 599 5779 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, 88972 81111 వాట్సాప్ చాట్‌బాట్ సేవలను రైతులు వినియోగించుకునేలా ప్రచారం చేయాలని చెప్పారు. ప్రతి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన డెడికేటెడ్ హెల్ప్‌డెస్క్‌లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ లేదా పెండింగ్ ఏర్పడినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రస్థాయి కమిటీ, జిల్లాస్థాయి కమిటీలు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, సీసీఐ, ఇతర సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. “రైతుకు ఎంఎస్ పీ అందించడమే ప్రధాన లక్ష్యం. ఈ విషయంలో ఏ స్థాయిలోనైనా నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తాం. పత్తి కొనుగోళ్లలో రైతులకు నష్టం కలిగించే చర్యలు, అవకతవకలు చోటుచేసుకుంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. అన్ని శాఖలు, రాష్ట్ర మరియు జిల్లాస్థాయి కమిటీలు, సీసీఐ అధికారులు సమిష్టి బాధ్యతతో పనిచేసి ప్రతి రైతుకు ఎంఎస్ పీ ప్రయోజనం అందేలా చూడాలని ఆయన ఆదేశించారు.
