. . . కలెక్టర్ భవేష్ మిశ్రా
. . . హౌసింగ్, వన మహోత్సవం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపుపై అధికారులతో సమీక్ష
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
భూగర్భ జలాలను పెంపొందించేందుకు, వర్షపు నీటిని నిలువ చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలసిరి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ భవేష్ మిశ్రా హెచ్చరించారు. ఎల్ నినో వల్ల వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఉన్న ప్రస్తుత తరుణంలో జలసిరి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విస్తృత స్థాయిలో ఇంకుడు గుంతలు, ఫాంపాండ్స్ తదితర నిర్మాణాలు జరిపించాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం జలసిరి, హౌసింగ్, వన మహోత్సవం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపు తదితర అంశాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలిసి మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. లక్ష్యానికి అనుగుణంగా ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణాలు జరగని మండలాల ఎంపీడీఓ లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా చొరవ చూపాలని, క్షేత్రస్థాయిలో రైతులను, ప్రజలను కలిసి అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో అలసత్వం వహించే వారిని సరెండర్ చేస్తానని కలెక్టర్ స్పష్టం చేశారు. కేవలం జీతాల కోసం పని చేయకూడదని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును వృధా కాకుండా కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యతను గుర్తెరిగి అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నైరుతీ రుతుపవనాలు మొట్టమొదటగా ప్రవేశించే కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో మునుపెన్నడూ లేనివిధంగా సాధారణంతో పోలిస్తే 44 శాతం లోటు వర్షపాతం నెలకొని ఉందని అన్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నీటి సంరక్షణకు ఉపయుక్తంగా నిలిచే ఫాంపాండ్స్, సోక్ పిట్స్ వంటి వాటిని విరివిగా నిర్మించేలా చూడాలన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోయి నీరు అందించక వృధాగా ఉన్న బోరు బావుల వద్ద వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో వీటి నిర్మాణాల వల్ల 5 నుండి 10 అడుగుల మేరకు భూగర్భ జలాల వృద్ధి చెందాయని, ఇక్కడ కూడా అలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు చొరవ చూపాలన్నారు.

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలు నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటి, వాటిని సంరక్షిన్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నాటిన మొక్కలను ఈ నెల 29న ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటకుండా తప్పుడు నివేదికలు సమర్పించిన వారి నుండి నిధుల రికవరీ చేపడతామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల ప్రగతిని సమీక్షిస్తూ, సెప్టెంబర్ 15లోపు పూర్తి స్థాయిలో లక్ష్యాన్ని సాధించాలని గడువు విధించారు. జాబ్ కార్డులు కలిగి ఉన్న ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులకు వీబీజీరాంజీ కింద వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేయాలని సూచించారు. ప్రభుత్వం నుండి కేటాయించబడే నిధులు పూర్తిస్థాయిలో వినియోగం అయ్యేలా చొరవ చూపాలన్నారు. గుడిసెలలో నివసిస్తున్న కుటుంబాలకు యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసేందుకు లబ్దిదారుల జాబితా రూపొందించాలని, రెండు పడక గదుల ఇళ్ళను అర్హులైన వారికి కేటాయించేందుకు వీలుగా లబ్దిదారుల జాబితాను తక్షణమే తహసిల్దార్లకు సమర్పించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఫాంపాండ్స్, సోక్ పిట్ల నిర్మాణాలు చేపట్టేలా, ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా రైతులను, ప్రజలను అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డీ.ఆర్.ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీ.ఈ.ఓ సాయాగౌడ్, డీ.ఆర్.డీ.ఓ సాయన్న, డీ.పీ.ఓ శ్రీనివాస్ రావు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీరాజ్ ఈ.ఈలు, ఏ.ఈలు తదితరులు పాల్గొన్నారు.

