ఇందల్వాయి, బతుకమ్మ :
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ముఖేష్ అనే వ్యక్తికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు ఇందల్వాయి ఎస్‌ఐ సుమలత తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ ప్లాజా వద్ద గత వారం రోజుల క్రితం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న ముకేశ్ గాల్జె (28) పట్టుబడ్డాడు. ముథేడ్, నాందేడ్ జిల్లా ప్రాంతానికి చెందిన ముకేశ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం అతడిని నిజామాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి బాలరాజు నిందితుడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ సుమలత వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీని వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని ఎస్‌ఐ సుమలత తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
