చంచగూడ, బతుకమ్మ: మరో ఉన్నతాధికారి అవినీతి తెలంగాణలో కలకలం రేపింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) హరి రామ్‌పై అవినీతి నిరోధక శాఖ ఏసీబీఅధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసి అతని ఇంటితోపాటు బంధువుల ఇళ్లలో 13 చోట్ల సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.200కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.
సోదాలు గజ్వేల్ లో ప్రారంభమై షేక్‌పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ లో కొనసాగాయి. విల్లాలు, ఫ్లాట్లు, ఏపీ అమరావతిలో కమర్షియల్ ఫ్లాట్‌లతోపాటు మార్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమిపఠాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను కూడా గుర్తించారు. బొమ్మల రామారంలో ఆరు ఎకరాల మామిడి తోటఫామ్ హౌస్, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్, మిర్యాల గూడలో ఓపెన్ ప్లాట్లను కూడా అధికారులు గుర్తించారు. అలాగే బీఎండబ్ల్యూ కారు, భారీగా బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈఎన్సీ హరి రామ్‌ను అరెస్టు చేసి, అర్థరాత్రి జడ్జి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం హరిరామ్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారుగా రూ.200 కోట్లు కాగా వీటి బహిరంగ మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే 10 రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు. దర్యాప్తులో షేక్‌పేట్, కొండాపూర్, మాదాపూర్, కోకాపేట్, కుత్బుల్లాపూర్, ఎల్లారెడ్డిగూడ, పటాన్ చెరు, యాదగిరిగుట్ట, కొత్తగూడెం, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను గుర్తించారు.
