- కొడుకుపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : వృద్ధురాలు అనుమానాస్థద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామానికి చెందిన బండారి విట్టవ్వ కు ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు సంతానం, అందరికీ పెళ్లిళ్లు అయ్యి ఎవరిది వారు ఉంటున్నారు. ప్రస్తుతం విట్టవ్వ తన కొడుకుతో పాటే తన భర్తతో కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నారు. కానీ గత కొన్ని రోజుల నుండి ఎవరిది వారు వేరుగా వండుకొని తింటున్నారు. గత పది రోజుల క్రితం విట్టవ్వ యొక్క గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో అప్పటినుండి తన కొడుకు సిలిండర్ను వాడుకుంటున్నది. ఈనెల 29న ఉదయం విట్టవ్వ తన కొడుకు గ్యాస్ సిలిండర్ పై వంట చేసుకుంటుండగా సాయిలు భార్య అయిన లావణ్య ఎందుకు మా సిలిండర్ పై వండుకుంటున్నావనే విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో వెంటనే విట్టవ్వ భర్త అయినా సాయన్న కల్పించుకొని వారిని విడిపించాడు. ఆ తర్వాత అదే రోజు ఉదయం 11 గంటలకు విట్టవ్వ తన ఇంటి ముందు రక్తపు వాంతులు చేసుకుంటూ కనిపించింది. విట్టవ్వ భర్త అయినా సాయన్న ఆమెను ఏమైంది అని అడగగా విట్టవ్వ తను ఇంట్లో ఉన్న బాత్రూంలోని యాసిడ్ తాగినాను అని చెప్పింది. దీంతో వెంటనే సాయన్న విట్టవ్వను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అక్కడ నుండి డాక్టర్ల సూచన మేరకు బాన్సువాడ గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. విట్టవ్వ భర్త అయిన సాయన్న తన భార్య మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ తన కొడుకు కొట్టడం వల్ల గాని యాసిడ్ తాగడం వల్ల గాని తన భార్య చనిపోయి ఉండవచ్చు అని ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎల్లారెడ్డి ఎస్ఐ బి.మహేష్ తెలిపారు.
