నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: గాండ్ల సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని సిర్నాపల్లి గడి గాండ్ల పట్టణ సంఘం రెండో అంతస్తును మరో ముఖ్య అతిథి, నుడా చైర్మన్ కేశ వేణుతో కలిసి ఎమ్మెల్యే గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందూర్ పట్టణ గాండ్ల సంఘం రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచేవిదంగా ఐక్యమత్యంతో అంచలంచెలుగా ఎదుగుతోందని అభినందించారు. రెండో అంతస్తు నిర్మాణానికి ఎస్డీఎఫ్ కింది రూ.5లక్షలు మంజూరు చేశానని అన్నారు. భవిష్యత్ లో సంఘం అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎమ్మెల్యే నిధులు కూడా మంజూరు చేయలేదని అన్నారు.
నియోజకవర్గం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అర్బన్ నియోజకవర్గంపై ప్రత్యేక చొరవ తీసుకొని స్పెషల్ ఫండ్ మంజురు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గాండ్ల పట్టణ సంఘం అధ్యక్షుడు అశోక్, నాగరాజు, కాంగ్రెస్ సీనియర్ లీడర్ నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
