. . . బీసీ-ఏలోని 57 ఉపకులాలకు అన్యాయం చేయవద్దు
. . . ముఖ్యమంత్రి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి
. . .బీసీ-ఏ జేఏసీ జిల్లా అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య, కన్వీనర్ మాడవేడి వినోద్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బీసీ-డి గ్రూపులో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులో చేర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ-ఏ జేఏసీ నిజామాబాద్ జిల్లా నాయకులు తెలిపారు. బీసీ-ఏలోని 57 ఉపకులాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి తన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బీసీ-ఏ జేఏసీ జిల్లా సమావేశంలో జేఏసీ జిల్లా అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య గంగపుత్ర, జిల్లా కన్వీనర్ మాడవేడి వినోద్ కుమార్ గంగపుత్ర మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన లెక్కల ప్రకారం రాష్ట్ర బీసీ జనాభాలో ముదిరాజ్ సామాజికవర్గం గణనీయమైన జనాభా కలిగి ఉందని పేర్కొన్నారు. ఆర్థిక, రాజకీయ, సాగుభూమి తదితర అంశాల్లో బీసీ-ఏలోని అనేక ఉపకులాలతో పోలిస్తే ముదిరాజ్ సామాజికవర్గం మెరుగైన స్థితిలో ఉందని వారు అభిప్రాయపడ్డారు.బీసీ-ఏ గ్రూపులోని 57 ఉపకులాల్లో అనేక కులాలకు ఇప్పటికీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేదని, సర్పంచ్, ఎంపీటీసీ వంటి స్థానాలకు కూడా చేరుకోలేని పరిస్థితుల్లో అనేక సామాజికవర్గాలుఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ కొన్ని కులాలు సంచార జీవనం సాగిస్తూ,సంప్రదాయ కులవృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో బిసి ల పరంగా రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన సామాజికవర్గాన్ని బీసీ-ఏలో చేర్చడం వల్ల ఇప్పటికే వెనుకబడిన చిన్న ఉపకులాలకు విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్ అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.అందువల్ల ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని,బీసీ-ఏలోని 57 ఉపకులాల హక్కులు, అవకాశాలను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు రజక, నాయకులు నగేష్ ఒడ్డెర,అనిల్ నాయీబ్రాహ్మణ, లక్ష్మీనారాయణ మేదర, రమేష్ కూనపులి, శ్రీనివాస్ ఎల్లాపి, మురళి,పాక శంకర్, గంగాప్రసాద్, సత్యనారాయణ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

