. . . నేలలోనే కుళ్లబెట్టి భూసారాన్ని పెంచండి
. . . వ్యవసాయ అధికారి వైష్ణవ్
ఏర్గట్ల, బతుకమ్మ :
గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన కానగర్తి గంగారాం వారి పొలంలో వరి గడ్డిని నేలలో కలియద్దున్నడం పాటిస్తూ నలుగురికి ఆదర్శనంగా నిలుస్తున్నారు. బుధవారం వారి పొలం సందర్శించిన సందర్భంగా వారిని అభినందిస్తూ తోటి రైతులకు మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ పలు సూచనలు చేశారు. రాబోయే పంటల దిగుబడులు, నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రైతులు వరి కోత అనంతరం పొలాలలో మిగిలే గడ్డి, తొట్లను కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరి మిగులు అవశేషాలను కాల్చడం వల్ల నేలలోని ఉపయోగకర సూక్ష్మజీవులు నశిస్తాయని, భూసారం తగ్గిపోతుందని, గాలిలో కాలుష్యం పెరుగుతుందని, పర్యావరణానికి హాని కలుగుతుందని, తదుపరి పంటల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. అందువల్ల రైతులు వరి గడ్డిని పొలంలోనే కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలని సూచించారు. వరి అవశేషాలను త్వరగా కుళ్లబెట్టాలంటే వరి గడ్డిని చిన్న ముక్కలుగా చాప్ చేసి, పశువుల ఎరువు మిశ్రమం లేదా జీవామృతం పిచికారీ చేసి, అవసరమైన తేమ ఉండేలా నీరు ఉంచి అనంతరం 15 – 20 రోజుల వ్యవధిలో కలియబెట్టాలని తెలిపారు. ఈ విధానం ద్వారా భూమిలో సేంద్రియ కార్బన్ పెరుగుతుందని, భూసారం మెరుగుపడుతుందని, రసాయన ఎరువుల అవసరం తగ్గుతుందని, పంట దిగుబడులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. క్షేత్ర సందర్శనలో సాయి సచిన్, వ్యవసాయ విస్తరణాధికారి, అభ్యుదయ రైతు కానగర్తి గంగారాం పాల్గొన్నారు.