. . . నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి
. . . సైబర నేరాలపై అవగాహన కలిగించాలి
. . . మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
ఆర్మూర్, బతుకమ్మ :
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి పై ఆర్మూర్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సీపీ సమగ్ర సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో ఆర్మూర్ డివిజన్ ఏ.సీ.పీ, సర్కిల్ ఇన్స్ పెక్టర్ లు, ఎస్ హెచ్ఓలు, ఎస్సైలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమావేశం ప్రారంభంలో రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని, చెక్ పోస్ట్ ల తనిఖీలు 24/7 తనిఖీలు చేయాలని, వాహనాల తనిఖీలు, చెక్ పోస్ట్ ల వద్ద సిబ్బంది అలసత్వం పనికిరాదని తెలిపారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్ గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, రౌడీషీటర్లు, పాత నేరస్తులు, బెయిల్‌పై విడుదలైన వారిపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని సూచించారు.

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే పేకాట, గుట్కా, ఇసుక, ఇతర అక్రమ వ్యాపారాలపై నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రిసెప్షన్ నిర్వహణ , రికార్డుల నిర్వహణ , స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. సీసీ కెమెరాల వినియోగాన్ని మరింత విస్తరించి , నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకొని , రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో బ్లాక్ స్పాట్లను గుర్తించి , సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవే రోడ్డులను కలుపుతూ ఉండేటటువంటి లింకు రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేయించడం , రోడ్డుకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించే విధముగా చూడాలని అన్నారు. రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఉన్నట్లయితే నేషనల్ హైవే మరియు స్టేట్ హైవే అథారిటీ ఇతర సంబంధిత అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి రోజు మీ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించాలని , ఓవర్ స్పీడ్ , త్రిబుల్ డ్రైవింగ్ , మైనర్లు వాహనాలు నడుపుట లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో రోడ్డు భద్రత నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ ఏ.సి.పి జె.వెంకటేశ్వర్ రెడ్డి, సి.సి.ఆర్బి ఇన్స్ పెక్టర్ అంజయ్య, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ పి. సత్యనారాయణ, భీంగల్ సి.ఐ పొన్నం సత్యనారాయణ, ఆర్మూర్ రూరల్ సీ.ఐ జాన్ రెడ్డి, భీంగల్ ఎస్.ఐ సి.హెచ్ తిరుపతి, ముప్కాల్ ఎస్.ఐ కిరణ్ పాల్, మెండోరా ఎస్.ఐ జె.సుహాసిని, ఏర్గట్ల ఎస్.ఐ పి.రాజేశ్వర్, బాల్కొండ ఎస్.ఐ కే.శైలేందర్, కమ్మర్ పల్లి ఎస్.ఐ జి.అనిల్ రెడ్డి, మోర్తాడ్ ఎస్.ఐ బి.రాము, వేల్పుర్ ఎస్.ఐ బి.సంజీవ్, నందిపేట్ ఎస్.ఐ శ్యామ్ రాజ్, ఆర్మూర్ ఎస్.ఐ – 1 రజనీకాంత్, ఆర్మూర్ ఎస్.ఐ – 2 కే.వినయ్ కుమార్, ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
