. . . పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మేడిపల్లి తండా, లక్ష్మీ సాగర్ తండా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.మేడిపల్లి గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మేడిపల్లి నుంచి లక్ష్మీ సాగర్ వరకు ఎస్డిఎఫ్ నిధులతో రూ.కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.అలాగే లక్ష్మీ సాగర్ నుంచి వ్యవసాయ పంట పొలాలకు వెళ్లేందుకు ఎస్డిఎఫ్ నిధులతో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన మెటల్ రోడ్డు, లో లెవెల్ వంతెనను కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన పనులను చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చందూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

