సిరిసిల్ల, బతుకమ్మ :
సాదాబైనామా ద్వారా జరిగిన భూ లావాదేవీల క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి సాదాబైనామా కేసు ఆమోదం పొందింది. తంగళ్లపల్లి మండలంలోని తంగళ్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఈ కేసుకు ఆమోదం లభించడం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సాదాబైనామా కేసులను పారదర్శకంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు భూ హక్కుల క్రమబద్ధీకరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీఓ తెలిపారు. జిల్లాలో తొలి కేసు ఆమోదం పొందడం సంతోషకరమైన పరిణామమని, అర్హత కలిగిన మిగతా సాదాబైనామా కేసులను కూడా ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనల మేరకు ఎలాంటి జాప్యం లేకుండా దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు ఇటికాల శంకర్‌కు తంగళ్లపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 5లో ఉన్న 0.30 గుంటల భూమికి సంబంధించిన 13(బి) ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, తంగళ్లపల్లి తహసీల్దార్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
