. . . 3 లక్షల అప్పు.. నమ్మించి నట్టేట ముంచిన కానిస్టేబుల్
. . . ఖాకీ చొక్కా వేసుకుని రక్షించాల్సినోడే భక్షించిండు
సూర్యాపేట, బతుకమ్మ :
సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సంచలనం సృష్టించిన భార్యాభర్తల జంట హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మోతే పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌నే పోలీసులు గుర్తించడం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. మోతేలో పంచాయతీ వ్యవహారాలకు వస్తుండే జిల్లేపల్లి సుందర్ ద్వారా కానిస్టేబుల్ యండి. షరీఫ్‌కు మృతులు నాగులు, భూబా దంపతులతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతో వారితో నమ్మకాన్ని పెంచుకున్న షరీఫ్.. వారి వద్ద నుంచి రూ.3 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని నాగులు, భూబా అడగడంతో వివాదం మొదలైనట్లు పోలీసులు తెలిపారు. డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే భయంతో వారిని హత్య చేసి అడ్డుతొలగించుకోవాలని షరీఫ్.. సుందర్‌తో కలిసి పథకం రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పథకం ప్రకారం నాగులు, భూబాలను హత్య చేసిన అనంతరం మృతదేహాలను జాతీయ రహదారి పక్కన పూడ్చిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. సుందర్ భూబాను తీసుకెళ్తున్న దృశ్యాలు పోలీసులకు కీలక ఆధారంగా మారాయి. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి గురువారం ఉదయం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద షరీఫ్, సుందర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై సూర్యాపేట ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. నేరానికి పాల్పడితే పోలీసు అయినా సరే చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని తెలిపారు. కేసు దర్యాప్తులో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ లచ్చిరెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ కీలక పాత్ర పోషించారు.
