వీడియో కాల్ చేసి రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వద్ద రూ.కోటి 50 లక్షలు వసూలు
హైదరాబాద్ లో ఘటన
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్, బతుకమ్మ : సుప్రీం కోర్టు జడ్జీ పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఏకంగా నకిలీ కోర్టు సృష్టించి, వీడియో కాల్ లో నకిలీ జడ్జిని చూపించి రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వద్ద రూ.కోటి 50 లక్షలు సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు. హైదరాబాద్ – వనస్థలిపురంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కు, ఒక కేసులో తన పేరు వచ్చిందని, కేసును సుప్రీం కోర్టు జడ్జి స్వయంగా విచారిస్తున్నారని సైబర్ నేరగాళ్లు సందేశం పంపి బోల్తా కొట్టించారు. జడ్జీ నుంచి వీడియో కాల్ వస్తుందని, మర్యాదగా వ్యవహరించాలని సైబర్ నేరగాళ్లు సూచించారు. కొద్దిసేపటికి జడ్జీ నుంచి వీడియో కాల్ రావడంతో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మర్యాద పూర్వకంగా మాట్లాడారు. తన పేరు ఒక పెద్ద కేసులో ఉందని, అరెస్టు చేయాల్సి వస్తుందని ఇంజినీర్ ను నకిలీ జడ్జీ బెదిరించారు. కేసు విషయంలో సుప్రీం కోర్టుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, కేసు ముగిశాక తిరిగి తన అకౌంట్లో పడిపోతాయని చెప్పి బురిడీ కొట్టించారు. దీంతో ఈవిషయం నమ్మిన మాజీ ఇంజినీర్ రూ. 1 కోటి 50 లక్షలు డిపాజిట్ చేశాడు. రోజులు గడిచినా డబ్బులు వెనక్కి రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
