నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్య, వైద్య రంగాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అధ్యయనం చేసేందుకు సీపీఎం జిల్లా కమిటీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్లు, యూనిఫాంలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించనున్నట్లు చెప్పారు. అలాగే ప్రతి తరగతికి ఉపాధ్యాయుల నియామకం జరిగిందా, పాఠశాల భవనాల పరిస్థితి ఎలా ఉంది, వర్షాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయా అనే అంశాలను అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో సరిపడా బెంచీలు, ల్యాబ్ సౌకర్యాలు, గ్రంథాలయాలు, క్రీడా మైదానాలు, ఇతర మౌలిక వసతులు ఉన్నాయా అనే విషయాలను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సదుపాయాలు కల్పిస్తే ప్రజల్లో ప్రభుత్వ విద్యా సంస్థలపై విశ్వాసం పెరిగి అడ్మిషన్లు కూడా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు, డొనేషన్ల పేరుతో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలు వివిధ రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్న రమేష్ బాబు, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని కోరారు. సరిపడా మందులు, వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు వివిధ వ్యాధుల నిర్ధారణ కోసం అవసరమైన ల్యాబ్ సౌకర్యాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధిక ధరలు, నిరుద్యోగం, గృహ స్థలాలు, పెన్షన్లు తదితర ప్రజా సమస్యలపై కూడా అధ్యయనం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పెద్ద వెంకట్ రాములు, శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు నన్నేసాబ్, జంగం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
