. . . ఐదుగురు విద్యార్థులకు బ్లాక్ బెల్ట్
దోమకొండ, బతుకమ్మ :
2022 లో కరాటే శిక్షణలో చేరిన జనగామ గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు నాలుగేళ్ల కఠోర సాధన అనంతరం 2026 జూన్ నెలలో ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ ను సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారని కరాటే మాస్టర్ కొండ లక్ష్మీనర్సు, గ్రాండ్ మాస్టర్ కామిండ్ల రాజయ్య తెలిపారు. ఆదివారం దోమకొండ గ్రామంలో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ పంపిణీ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 23 మంది విద్యార్థులు బ్లాక్ బెల్ట్ లు అందుకున్నారు. జనగామ, దోమకొండ, పెద్దమల్లారెడ్డి, రామాయంపేట, అంచనూర్, సంగమేశ్వర తదితర గ్రామాల నుంచి విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులను గ్రాండ్ మాస్టర్ కామిండ్ల రాజయ్య, మాస్టర్ కొండ లక్ష్మీనర్సు అభినందిస్తూ, కరాటే ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, స్వీయ రక్షణ నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులను అభినందించి వారి భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు తెలిపారు.
. . . బ్లాక్ బెల్ట్ పోటీల్లో జనగామ విద్యార్థుల ప్రతిభ
ఉమ్మడి దోమకొండ మండల స్థాయిలో ఆదివారం నిర్వహించిన బ్లాక్ బెల్ట్ పోటీల్లో జనగామ గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చారు. ఈ పోటీల్లో మంగలి అఖిల్, డాకూరి ధనుష్ తలా 421 మార్కులు సాధించి సంయుక్తంగా రెండవ స్థానం దక్కించుకున్నారు. కేవలం ఒక మార్కు తేడాతో మొదటి స్థానాన్ని కోల్పోవడం విశేషం. అలాగే చాకలి మనోజ్ 412 మార్కులతో 6వ స్థానం, దండుగుల భరత్ 380 మార్కులతో 15వ స్థానం, డాకూరి లిఖిత 371 మార్కులతో 17వ స్థానం సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు. విజేత విద్యార్థులను గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.