. . . 35 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పైకి చేరిన పూర్వ విద్యార్థులు
. . . గురువులకు గురుదక్షిణ, తోటి విద్యార్థినులకు వస్త్రదానం
ఆర్మూర్ (చేపూర్), బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలోని గురడి రెడ్డి కళ్యాణ మండపంలో చేపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1990-91 విద్యాసంవత్సరం ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. పాఠశాల విద్యాభ్యాసం పూర్తయి సుమారు 35 సంవత్సరాలు గడిచిన సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకే వేదిక పైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 40 మంది వరకు పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, క్లాస్ రూమ్ అల్లర్లను, గురువులు బోధించిన విద్యావిధానాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఎక్కడెక్కడో స్థిరపడిన మిత్రులంతా ఇన్నేళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వారు పేర్కొన్నారు.
. . . గురువులకు సన్మానం – మిత్రులకు వస్త్ర బహుకరణ
తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. మాజీ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బుచ్చయ్య సార్, అంజయ్య సార్, రఘోతం రెడ్డి సార్‌తో పాటు ముగ్గురు గంగాధర్ సార్లు.. ఇలా మొత్తం 16 మంది గురువులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి పూర్వ విద్యార్థులు గురుదక్షిణగా బట్టలు పెట్టి, పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అదేవిధంగా, ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఒక వినూత్న సాంప్రదాయానికి తెరలేపారు. తోటి విద్యార్థినులను తమ స్వంత ఆడపడుచులుగా భావించి, ఆ బ్యాచ్‌లోని మహిళలకు, వారి భర్తలకు పూర్వ విద్యార్థులు (పురుషులు) నూతన వస్త్రాలను (చీరలను) బహుకరించి తమ ఆత్మీయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్సీ బ్యాచ్ విద్యార్థులైన టీఎన్జీఓ జిల్లా మాజీ అధ్యక్షుడు, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మీనుగు రాజేశ్వర్, ఉపాధ్యాయుడు తోపారం కిషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్ గంజి చంద్రశేఖర్, రైల్వే డిపార్ట్ మెంట్ లో హెల్త్ అసిస్టెంట్ గా పూణేలో విధులు నిర్వహిస్తున్న ఐ శ్రీనివాస్ శంకర్, శ్రీనివాస్, గంగాధర్, నర్సయ్య రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
