ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ముస్లింలకు ప్రస్తుతం కల్పిస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ పట్టణంలోని నాలెడ్జ్ పార్క్ స్కూల్లో ఆదివారం జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో 4% ముస్లిం రిజర్వేషన్లు తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించిన ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ ని నాలెడ్జ్ పార్క్ స్కూల్ యాజమాన్యం సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాలెడ్జ్ పార్క్ స్కూల్ నుండి చదువుకున్న 11 మంది విద్యార్థులకు 4% రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ లో సీట్లు సాధించారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ముస్లింలకు ప్రస్తుతం కల్పిస్తున్న 4% రిజర్వేషన్లను రద్దు చేసేందుకు జరుగుతున్న కుట్రపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ రిజర్వేషన్లను రద్దు చేయలేరని, రద్దు చేసే అవకాశంపై అమిత్ షా గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. తెలుగు రాష్ట్రాల్లో 4% ముస్లిం రిజర్వేషన్ల కొనసాగింపుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ల అమలుకు చేసిన పోరాటాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ పోరాటాన్ని నేటికీ కోర్టుల్లో పోరాడుతూనే ఉన్నానని అన్నారు. 4% ముస్లిం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఈ రిజర్వేషన్లను కాపాడుకోవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మైనారిటీ పాఠశాలలకు, నివాస భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిందని, ముస్లిం మైనారిటీలకు అన్ని రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రిజర్వేషన్ వల్ల వేలాది మంది పేద ముస్లిం మైనారిటీ యువకులు ఇంజనీర్లు, డాక్టర్లుగా మారగలిగారని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించి నేటికి 31 ఏళ్లు పూర్తయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు.

