- మరోసారి రైతులని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు
- రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు
- రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది
- మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : రేవంత్ కాంగ్రెస్ సర్కార్ రైతులను దగా చేస్తుంది అని, ఓట్ల సమయంలోనే రైతులకు పథకాలు వర్తింపజేస్తుంది అని, ఓట్లు లేకుంటే రైతులకు ఇచ్చే పథకాలను ఎగ్గొడుతు, వాటి ఊసు ఎత్తడం లేదు అని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే రైతులకు డైరెక్ట్ గా నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టిన రైతు బాంధవుడు కేసీఆర్ అన్నారు. మొదటిసారి నేరుగా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద రైతులు నాట్లు వేసేటప్పుడే కేసీఆర్ రైతు బంధు ఇచ్చాడని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు ఇస్తున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు పంట సీజన్ లు వచ్చాయని, మొదటిసారి ఎంపీ ఎన్నికలు ఉండటం వల్ల రైతు బంధు ఇచ్చాడని తెలిపారు. అవి కూడా కెసిఆర్ రైతు బంధు కోసం ఉంచిన డబ్బులే ఇచ్చాడన్నారు. రెండోసారీ ఏ ఎన్నికలు లేనందు వల్ల రైతు భరోసా ఎగ్గొట్టాడన్నారు. మూడోసారి ఏ ఎన్నికలు లేనందున తూతూ మంత్రంగా 3 ఎకరాల వరకు ఇచ్చి మిగితా వారికి ఎగ్గొట్టాడని తెలిపారు. నాలుగవ సారి స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న దృష్ట్యా ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడన్నారు. ఎన్నికలు ఉంటే రైతు బంధు.. ఎన్నికలు లేకుంటే రైతుబందు లేదు.. ఇది కాంగ్రెస్ నైజం.. రైతులు గమనించాలి.. కేవలం ఎన్నికల కోసం రైతు భరోసా వేసి రైతు లను మోసం చేసి ఓట్లు తీసుకునే ప్రయత్న రేవంత్ రెడ్డి చేస్తున్నాడని అన్నారు. రుణమాఫీపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ తుంగలో తొక్కాడని, డిసెంబర్ 9న మాఫీ అని చెప్పి మాట తప్పిండని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి పూటకో తేదీ చెప్పుకుంటూ వాయిదాలు వేశాడని తెలిపారు. చివరికి బిఆర్ఎస్ ఒత్తిడి తో సగం మందికి రుణమాఫీ చేసి మిగతా సగం మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టాడన్నారు. ఎన్నికల మానిఫెస్టో లో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎకరానికి 7వేల 500లు లెక్కన ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి సారి రైతు భరోసాకు కేసీఆర్ ఉంచిన 5000 మాత్రమే ఎకరానికి ఇచ్చి 2500 ఎగ్గోట్టాడన్నారు. అంటే 5 ఎకరాలకు లెక్క వేస్తే 12500, రెండో సారి రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టాడు అంటే 5 ఎకరాలకు 37500, మూడవసారి కూడ 5 ఎకరాల రైతుకు ఎగ్గొట్టిన రైతు భరోసా 37500. అంటే మూడు విడుతలు కలిపి 5 ఎకరాలు ఉన్న రైతుకు 87500 రూపాయలు రైతు భరోసా రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు అని ఎమ్మెల్యే అన్నారు. రుణమాఫీ కానీ సగం మంది రైతులకు 2 లక్షల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడని తెలిపారు. అన్ని రకాల వడ్లకు క్వింటాలుకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఐదెకరాల రైతుకు మూడు సీజన్ లు కలిపి బోనస్ కింద సుమారు 1లక్ష 50 వేల ఎగ్గొట్టాడని అన్నారు. ఈ సీజన్ లో కూడా ఇస్తామన్న వడ్లకు బోనస్ ఇప్పటికి ఇవ్వలేదని తెలిపారు. కేసీఆర్ సర్కార్ 1150 కె జిలుగు విత్తనాలు ఇచ్చేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్ సర్కార్ రూ. 2140 లకు పెంచారని తెలిపారు. కేసీఆర్ సర్కారు రాయితీపై విత్తనాలు ఇచ్చేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవేమీ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని తెలిపారు. ఈ సీజన్ లో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. గతంలో కేసీఆర్ ముందుగా స్టాక్ పెట్టేవారని, నేడు ముందుచూపు లేని సర్కార్ నిర్వాకం వల్ల యూరియా దొరక్క రైతులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎగ్గొట్టిన రైతు భరోసా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కానీ రైతులందరికి 2 లక్షలు రుణమాఫీ చేయాలన్నారు. అన్ని రకాల వడ్లకు పాత సీజన్ లతో సహా రూ. 500 బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. రైతులకు ఇప్పటికే బాకీ ఉన్న డబ్బులు ఇచ్చినంకనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఓట్లు అడగాలి లేకపోతే రైతులు మీ పై తిరగబడటం ఖాయం అని కాంగ్రెస్ పార్టీ ని ఎమ్మెల్యే వేముల హెచ్చరించారు.
