26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రేపు కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

 

. . . విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టు, మున్సిపల్ అభివృద్ధి పనులకు శ్రీకారం

 

కుమ్రం భీం-అసిఫాబాద్, బతుకమ్మ :

 

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపట్టనున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మొత్తం రూ.112.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చింతలమానేపల్లి మండలంలోని కౌటాల (రవీంద్రనగర్ క్యాంపు నం-2) గ్రామంలో ఏర్పాటు చేయనున్న 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.56.55 కోట్లు. రెబ్బెన మండలం నాంబాల్ గ్రామంలో రూ.6 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా చింతలమానేపల్లి, గుడ్లబోరి, కాపువాడ, చింతకుంట, అంకుషాపూర్ ప్రాంతాల్లో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల పనులకు కూడా ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఉపకేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత బలోపేతం కావడంతో పాటు వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో రూ.15 కోట్లతో చేపట్టనున్న తొమ్మిది అభివృద్ధి పనులు, కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.18.70 కోట్లతో చేపట్టనున్న ఎనిమిది అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణ, పునరుత్పాదక ఇంధన వినియోగ ప్రోత్సాహం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి  జూపల్లి  తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా  ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.

More articles

Latest article