. . . డబుల్ రిజిస్ట్రేషన్ పై పిర్యాదు చేస్తారా మీ ‘సంగతి’ చూస్తాం
. . . మీడియా ముసుగులో ‘సూడో’ మీడియా గ్యాంగ్ బేదిరింపులు
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సూడో మీడియా ముసుగులో ఒక మూఠా రెచ్చిపోతుంది. గంజాయి దందా మొదలుకోని ఆన్ లైన్ బెట్టింగ్, పోలీస్ స్టేషన్ లలో సెటిల్ మెంట్ లు, భూ కబ్జాలు. డూప్లికేట్ రిజిస్ట్రేషన్ లు చేస్తున్న ముఠా రెచ్చిపోతుంది. పోలీసులు తమ చెప్పు చేతల్లో ఉన్నారని, తాము స్టేషన్ కు వెళితే రెడ్ కార్పేట్ పరుస్తారని చెబుతున్న పాత నేరస్థుల గ్యాంగ్ ఆగడాలు శృతి మించాయి. ఎఫ్ఐఆర్ లలో పేర్లనే తారు మారు చేస్తాం.. మేము తలుచుకుంటే కేసుల్లో ఇరికిస్తాం అని ఏకంగా పోలీస్ లు తమ వెనుక ఉన్నారని మీ ‘ సంగతి ’ చూస్తాం అని బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. గతనెల చివరి వారంలో నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కంఠేశ్వర్ ప్రాంతానికి చెందిన భూమి డబుల్ రిజిస్ట్రేషన్ విషయంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురి మీద కేసు నమోదు కాగా అందులో ఒకరు సుడో మీడియా(యూ ట్యూబ్) రిపోర్టర్ ఉన్నారు. గతంలో నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భూ కబ్జా అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహరం కేసులో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తిని రిపోర్టర్ గా ఐడి కార్డు ఇచ్చి భూ కబ్జాలకు, అక్రమ రిజిస్ట్రేషన్ లకు తెరలేపింది సూడో మీడియా గ్యాంగ్….
నిజామాబాద్ నగర శివారులోని కంఠేశ్వర్ లో గల తన 2 ఎకరాల భూమిని ఓ వ్యక్తి 1981 లో సోసైటికి రిజస్ట్రేషన్ చేశారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణిలో సదరు భూమి వివరాలు సోసైటికి గాకుండా దానిని దానం చేసిన దాత పేరు పైన ఉన్నట్టు గుర్తించారు. రెవెన్యూ శాఖలో ఉద్యోగి తనకు టచ్ లో ఉన్న యూట్యూబ్ రిపోర్టర్ తో కలిసి తాము చెప్పిన ఇద్దరు వ్యక్తుల పై రిజిస్ట్రేషన్ కోసం జిపిఏ చేయించాడు. దానిని రిజిస్ట్రేషన్ చేయించడంతో ఈ వ్యవహరం వెలుగు చూసింది. కోట్ల రూపాయల భూమిని అప్పనంగా కొట్టేయడంలో ఆరి తేరిన సూడో మీడియా గ్యాంగ్ ఈ కథను వెనుకుండి నడిపించినట్లు తెలిసింది. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్, బైపాస్ రోడ్డు వైడింగ్ లో భూములను కోల్పోయిన, యజమానులు లేని భూములకు పత్రాలను తయారు చేయడంలో సూడో మీడియా గ్యాంగ్ ఆరి తేరింది. వారే రెవెన్యూ శాఖలో, పోలీస్ శాఖలో తమకు ఉన్న పరిచయాలను పెట్టుబడిగా అక్రమంగా భూముల కబ్జాకు, రిజిస్ట్రేషన్ లకు తెరలేపింది. దాని కోసం అక్షరం ముక్క రాని వారిని రిపోర్టర్ లుగా ఐడి కార్డులు ఇచ్చి నిజామాబాద్ మీదకు వదిలారు.
నిజామాబాద్ నగర శివారులో సొసైటికి రిజిస్ట్రేషన్ చేసిన భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసు నమోదు కావడంతో సుడో మీడియా రెచ్చిపోయింది. ఏకంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారులను బ్లాక్ మెయిల్స్ కు దిగినట్లు తెలిసింది. డాక్యుమెంట్ రైటర్ ల ద్వారా బెదిరింపులకు దిగినట్లు సమాచారం. కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ లు సక్రమంగా జరుగుతున్నాయా, మీ సంగతి చూస్తాం అని బెదిరింపులకు దిగడం విశేషం. తాము ఫోన్ చేస్తే పోలీస్ అధికారులు స్పందిస్తారని వారి ముందే ఫోన్ లు చేసి ఫోన్ కాల్ లిస్ట్ ను చూపి బెదిరించడం దారుణ పరిస్థితులను దస్తావేజు లేఖరులు చెబుతున్నారు. నిజామాబాద్ నగరంలో తాము చెప్పిందే జరుగుతుంది అని తమ రిపోర్టర్ పై కేసు నమోదు చేయడంపై వారు బ్లాక్ మెయిలింగ్ కు దిగడం చర్చనీయాంశంగా మారింది. పోలీస్ అధికారుల పేరు చెప్పి చేస్తున్న దందాపై ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ఒకటవ పోలీస్ స్టేషన్ లో జరిగిన డబుల్ రిజిస్ట్రేషన్ కేసులో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటే గాని పోలీస్ అధికారులకు వస్తున్న చెడ్డ పేరును రుపు మాపలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలొ పోలీస్ అధికారులు విచారణ జరిపి సుడో మీడియా ముసుగులో చేస్తున్న అక్రమ దందాలకు తమకు సంబంధం లేదని నిరుపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహరంలో జిల్లా పోలీస్ బాస్ స్పందిస్తేనే పరిస్థితి చక్కదిద్దే అవకాశం ఉంది.